ఆపరేషన్ ఆకర్ష్: టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

by Seetharam |   ( Updated:2023-12-15 06:07:08.0  )
ఆపరేషన్ ఆకర్ష్: టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అలర్ట్ అయిన ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వారిని మార్చకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటిది జరగకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఏపీలో నియోజకవర్గాల ఇన్‌చార్జిల, మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఇన్‌చార్జిల మార్పులు చేర్పులపై ఫోకస్ పెడుతుంటే..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో అధికారికంగా చేరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

టికెట్‌పై హామీ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఆ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు దిగింది. పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో అప్పటి నుంచి సైలెంట్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనంతరం యువగళం పాదయాత్రలో ఓ మెరుపు మెరిపించారు. అయితే టీడీపీలో చేరే అంశంపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలకు సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని..బలబలాలను పరిగణలోకి తీసుకుని ప్రజల ఆమోదంతో అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో మాదిరిగా అభ్యర్థులను ప్రకటించబోనని ప్రజల ఆమోదయోగ్యం లేనిదే వారికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మేకపాటి రాజకీయ భవితవ్యంపై గందరగోళం ఏర్పడింది. ఇంతలో ఉదయగిరి టికెట్ చంద్రశేఖర్ రెడ్డికే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీ నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నేడు అధికారికంగా టీడీపీలోకి

ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈనెల 15న సాయంత్రం 3 గంటలకు తర్వాత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరిన అనంతరం టికెట్ పై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులను టీడీపీలో చేర్పించి ఎమ్మెల్యే మాత్రం చేరకుండా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది.

Advertisement

Next Story