రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్రానికి ఎంపీ V. Vijayasai Reddy రిక్వెస్ట్

by Sumithra |   ( Updated:2022-12-09 09:45:40.0  )
రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్రానికి ఎంపీ V. Vijayasai Reddy రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో శుక్రవారం ఆయన బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నించారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 75వ సంవత్సరం ఇది. ఈ 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందని వ్యాఖ్యానించారు. అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్‌ కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్‌ దక్కలేదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్‌ 27 శాతానికే పరిమితమైందన్నారు. రిజర్వేషన్‌ సీలింగ్‌ 50 శాతం మించి ఉండొచ్చు. ఈ సీలింగ్‌ను సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన కాదని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం ధృవీకరించిందన్నారు. ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు ఉండబోవన్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్‌ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టాలి అని విజయసాయిరెడ్డి కోరారు.

Also Read....

ఒకే వేదికపై కొడాలి నాని, వంగవీటి రాధా

Advertisement

Next Story