వారిపై చర్యలు తీసుకోండి: ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం

by srinivas |
వారిపై చర్యలు తీసుకోండి: ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం
X

దిశ, అనంతపురం ప్రతినిధి: రాజకీయ, వ్యక్తిగత కక్షల పేరుతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణచివేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హెచ్చరించారు. వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పులిమి సమాజంలో అల్లకల్లోలం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి విఘాతం కలిగిస్తూ, హత్యలకు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.రత్నకు మంత్రి సవిత ఆదేశించారు.

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో జరిగిన వ్యక్తిగత ఘర్షణలో కురుబ లింగమయ్య గాయపడి, అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. లింగమయ్య మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తుండగా, మార్గం మధ్యలో మంత్రి సవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘర్షణలో లింగమయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు.

ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో ఇపుడిపుడే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా జోరందుకున్నాయన్నారు. ఇటువంటి సమయంలో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావే లేదన్నారు. అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, సమాజంలో అశాంతికి కారణమయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను మంత్రి సవిత ఫోన్లో ఆదేశించారు. అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి గాసిప్‌లూ నమ్మొద్దని, ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని మంత్రి సవిత కోరారు.

Next Story

Most Viewed