Nominated Posts: ఫస్ట్ లిస్ట్‌లో ఎవరికి చోటు దక్కేనో?

by srinivas |
Nominated Posts: ఫస్ట్ లిస్ట్‌లో ఎవరికి చోటు దక్కేనో?
X

దిశ, పల్నాడు: నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక ఫార్ములా రూపొందించనట్లు ప్రచారం జరుగుతోంది. పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు ముందంజలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. దీంతో మూడు పార్టీల్లోని నేతలు నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారు. ముందుగా గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిసింది. మిత్ర పక్షాలకు కేటాయించిన 31స్థానాల్లో ముందుగా పదవులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు 11 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించిన చోట, పార్టీని సమర్ధవంతంగా నడిపే టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తారంటున్నారు. దీంతో మొత్తం మీద నలభై రెండు స్థానాల్లో ఉన్న టిడిపి నేతలు పదవులపై ఆశ పెట్టుకున్నారు.

గుంటూరు జిల్లాపై క్లారిటీ!

ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారని అనుకుంటున్నారు. రాష్ట్ర సాయిలో ఆర్టీసీ ఛైర్మన్, సివిల్ సప్లై కార్పొరేషన్, ఏపీఐఐసీ పదవులలో ఏది కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పెదకూరపాడు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నామినేటెడ్ పదవుల రేస్‌లో ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. అలాగే, గుంటూరు వెస్ట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కోవెలమూడి నానిని కాదని బీసీ మహిళ అయిన గల్లా మాధవికి టికెట్ ఇచ్చారు. దీంతో నానికి నామినేటెడ్ పదవి వస్తుందని భావిస్తున్నారు. మొదటి విడత నామినేటెడ్ పదవుల భర్తీలో ఎవరికి ఏ పదవి వస్తుందోనన్న టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, అధిష్టానం మాత్రం ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed