Kodali Nani: తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ సమక్షంలోనే సంచలన ప్రకటన

by srinivas |
Kodali Nani: తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ సమక్షంలోనే సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి పీఠం నుంచి వైఎస్ జగన్‌ను దించడం కాదు కదా సీటును కదిపే దమ్ము చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల‌కు లేద‌ని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం వైఎస్ జగన్ అని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజ‌ల 20 ఏళ్ల కలను సీఎం వైఎస్ జగన్ నెరేవేర్చారని స్పష్టం చేశారు. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత వైఎస్ఆర్ చలవేనని చెప్పారు. రూ.800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు రూ. 180 కోట్లు చెల్లించడం. అందులో రూ.160 కోట్లు కేంద్రం ఇచ్చిందని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి తమ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఖర్చు పెట్టిందని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. ముష్టి రూ.20 కోట్లు ఇచ్చి తానే టిడ్కో ఇళ్లు పూర్తి చేశానని గుడివాడ వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పాడని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ సొంత గ్రామానికి చంద్రబాబు చేసిందేమీ లేద‌ని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు.

దమ్ముంటే చంద్రబాబు గుడివాడ నుంచి పోటీ చేయాలి

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలో ఈ టిడ్కో ఇళ్ల వద్దనే ఆగారని మాజీమంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. ఈ టిడ్కో ఇళ్ల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగిందని.. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు కొట్టేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆ రోజు జగన్‌కు తెలియజేసినట్లు తెలిపారు. ఆ రోజు ఒక్క రూపాయికే ఇల్లు ఇస్తానని వైఎస్‌ జగన్‌ వాగ్ధానం చేశారని అది ఈ రోజు చేసి చూపించారని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. ‘రూ.200 కోట్లు బ్యాంకు లోన్‌ లబ్ధిదారులకు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రూ. 400 కోట్లు ఇచ్చింది. ఇంకా పేదలకు ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. 178 ఎకరాల భూమిని దాదాపు వంద కోట్లతో కొనుగోలు చేశారు. మౌలిక సదుపాయాలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మిగిలిన ఇళ్లు కూడా పూర్తి చేసే బాధ్యత నాదే.’ అని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. వైఎస్ జగన్‌ 77 ఎకరాల్లో టిడ్కో ల్యాండ్, గుడ్ల వల్లేరులో 30 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, 106 ఎకరాలు మంచినీటి అవసరాలకు వివిధ గ్రామాల్లో 40 ఎకరాలు కొనిచ్చారని గుర్తు చేశారు. నాన్న ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వేస్తానని వైఎస్‌ జగన్‌ చెబితే.. ఇది ఎలా సాధ్యమని అనుకున్నామని, కానీ ఈనాడు అది నిజమని నిరూపించారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌ ఇద్దరూ కలిసి గుడివాలోనే 600 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, ఈ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలకు ఒక ఎకరం కొన్నట్లు చెప్పినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీమంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌తో చంద్రబాబుకు పోలికా అని అన్నారు. చంద్రబాబు దమ్ముంటే ఇక్కడికి వచ్చి పోటీ చేసి చేయాలని సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్ దేనికోసం పార్టీ పెట్టాడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాజీమంత్రి కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. ‘నేను శాసనసభలో అడుగుపెడతాను..దమ్ముంటే జగన్‌ ఆపు అంటున్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికేనా? ఆయన దేనికి పార్టీ పెట్టాడు..ముఖ్యమంత్రి అవ్వడానికే. రెండు పార్టీలను కలుపుకుంటే కూడా పవన్‌ అసెంబ్లీలోకి వెళ్లలేకపోతున్నాడు. నవనీత్‌కౌర్, సుమలత కూడా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలుగా గెలిచారు. పవన్‌కు మాత్రం 16 పార్టీలు సపోర్టు చేసినా, మెగా సూపర్‌స్టార్, ఆ స్టార్, ఈ స్టార్‌ అనే బిరుదులు ఉన్నా..ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు’ అని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శాసన సభకు వెళ్లడానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే చాలు..దానికి పార్టీ పెట్టడం, రోడ్ల వెంట తిరగడం, సొల్లు కబుర్లు చెప్పడం అవసరమా? అని నిలదీశారు. ‘పవన్‌ అసెంబ్లీలో అడుగు పెట్టడం, చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నేతగా ఉండటమే. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచి కదిపే దమ్ము, శక్తి ఈ రాష్ట్రమే కాదు..ఈ దేశంలోనే ఎవరికి లేదు.’ అని మాజీమంత్రి కొడాలి నాని చెప్పారు. ‘ఈ ప్రాంతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం పెట్టగానే తనివి తీరడం లేదు. ఏదో ఒకటి చేయాలి. వైఎస్‌ఆర్, వైఎస్‌ జగన్‌ చేసిన మేలుకు జీవితాంతం కొడాలి నాని అనే వాడు ఈ భూమి వదిలే వరకు, చచ్చేంత వరకు మీ మనిషిగా బతుకుతాను. ఎన్ని జన్మలెత్తినా ఈ నియోజకవర్గ ప్రజలకు, వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను. రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇవ్వాలి.’ అని మాజీమంత్రి కొడాలి నాని ప్రజలను కోరారు.

Advertisement

Next Story