ఒకే వేదిక పంచుకోనున్న రజినీకాంత్, చంద్రబాబు, బాలకృష్ణ

by srinivas |
ఒకే వేదిక పంచుకోనున్న రజినీకాంత్, చంద్రబాబు, బాలకృష్ణ
X
  • బెజవాడకు సూపర్ స్టార్ రజినీకాంత్
  • ఈఏడాది జనవరిలో చంద్రబాబుతో తలైవా భేటీ

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక పంచుకోనున్నారు. వీరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఈ వేదికలో సైతం పాలుపంచుకోనున్నారు. సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా వెలుగొందుతున్న రజనీకాంత్, బాలకృష్ణలతోపాటు జాతీయ రాజకీయాలను సైతం శాసించిన చంద్రబాబు ఈ ముగ్గురు ఒకే వేదిక పంచుకోనున్నారు. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రజినీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులు ముగ్గురూ ఒకే వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 28న ఏపీకి రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈనెల 28న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో జరిగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ ఉత్సవాల్లో రజినీకాంత్ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించారు. ఈ వేడుకలకు రజనీకాంత్‌తో పాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారని వెల్లడించారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సభలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలతో కూడిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన రెండు పుస్తకాలను సభలో రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు.

చంద్రబాబుతో సత్సంబంధాలు

ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 9న చంద్రబాబుతో రజినీకాంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తలైవాకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇరువురు యోగక్షేమాలపై చర్చించుకున్నారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

బీజేపీ రాయబారిగా చంద్రబాబును రజినీకాంత్ కలిశారంటూ ప్రచారం

అయితే బీజేపీ రాయబారిగా చంద్రబాబును రజినీకాంత్ కలిశారంటూ ప్రచారం జరిగింది. బీజేపీ, టీడీపీ మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు రజినీకాంత్ ప్రయత్నించినట్లు కూడా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. తన ప్రియమైన స్నేహితుడిని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే సుమారు నాలుగు నెలల విరామం తర్వాత చంద్రబాబు, రజినీకాంత్‌లు ఒకే వేదిక పంచుకోనున్నారు. ఇంతేకాదు అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కంటతడిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనూ చంద్రబాబుకు రజినీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. అటు రాజకీయంగానూ ఇటు వ్యక్తిగతంగానూ చంద్రబాబు, రజనీకాంత్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. తాజాగా రజినీకాంత్ పర్యటన నేపథ్యంలో ఈ సత్సంబంధాలు ఎటువైపు అడుగులు వేస్తారో అన్న ఆసక్తికర చర్చజరుగుతుంది.

దూరంగానే అంటూ దగ్గరగా

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పార్టీ పేరు, గుర్తును కూడా రిజిస్టర్ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా తన అభిమాన సంఘాల అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అనంతరం అకస్మాత్తుగా తాను పార్టీ పెట్టడం లేదని ప్రకటించేశారు. దీంతో అభిమానులు సైతం ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. రజినీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు సైతం స్వాగతించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed