ఒక్క రూపాయికే ఇళ్లు ఇస్తున్నాం: Cm Jagan

by srinivas |   ( Updated:2023-06-16 12:30:33.0  )
ఒక్క రూపాయికే ఇళ్లు ఇస్తున్నాం: Cm Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘అక్కచెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా.. మనం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు అని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరుగుతుంది. మనం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని గతంలో చెప్పాను. మనం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు.. ఒక్క రూపాయికే ఇస్తామని గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. నేను చెప్పిన విధంగా ఈరోజు దాన్ని నిజంచేసి చూపిస్తూ ఇవిగో ఆ ఇళ్లు.. ఇదిగో ఆ ఊళ్లూ అని ఇక్కడ నుంచి రాష్ట్రానికి కాదు.. దేశానికి చూపిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేశారు. అంతకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఈ లేఅవుట్‌లో అక్షరాల 257 ఎకరాల స్థలం సేకరించి పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు. వీటన్నింటి మధ్య కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. జగనన్న కాలనీల్లో అక్షరాల 16,240 కుటుంబాలు. ఇంటికి కనీసం ముగ్గురు చొప్పున తీసుకున్నా.. కనీసం అంటే 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే ఈ జగనన్న లేఅవుట్‌లో నివాసం ఉండబోతున్నారని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

ఒక్కో లబ్ధిదారుడికి రూ.7 లక్షలు ఆస్తి

‘గుడివాడలో రూ.800 కోట్లతో 8,912 టిడ్కో ఇళ్లు నిర్మించాం. ఈ లేఅవుట్‌లో అక్షరాల 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించాం. ఈ లేఅవుట్‌లో 7,728 ఇళ్ల స్థలాలు, 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి అక్షరాల 16,240 ఇళ్లలో కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. గుడివాడ నియోజకవర్గం మొత్తం చూస్తే.. 7,728 ఇళ్ల పట్టాలతో కలిపితే నియోజకవర్గంలో మొత్తంగా 13,145 మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించాం. 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే.. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 22 వేల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.’ అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ‘ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన సెంటు స్థలం విలువ రూ.7 లక్షలు ఉంటుంది. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయితే.. ఆ తరువాత ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.10 నుంచి రూ.12 లక్షలు’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఇచ్చిన 8,859 ఇళ్లకు అదనంగా జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరో 4200 ఇళ్ల నిర్మాణం కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు. గుడివాడలోనూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్పుటంగా ప్రతి గ్రామంలో కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో అడుగులు వేగంగా వేస్తూ ఒక బాధ్యతగా పేదవాడిపై మమకారంతో అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ బహిరంగ సభలో వెల్లడించారు.

వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్

‘ఇదే గుడివాడలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. గుడివాడ అల్లుడినని చెప్పుకుంటాడు. తన 14 ఏళ్ల పాలనలో గుడివాడలోని పేదలకు ఒక్క సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు కట్టించింది లేదు.. ఒక్క సెంటు స్థలం ఇచ్చింది లేదు’ అని సీఎం జగన్ అన్నారు. మరోవైపు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కులాల సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టులను ఆశ్రయించారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా పేదలకు మేలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేవారు. ‘మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకో ఛాన్స్‌ ఇస్తే మంచి చేస్తానని బాబు చెబుతున్నాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఇంకా ఎక్కువే చేస్తా అంటున్నాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. మీ ప్రతీ ఇంటికి బంగారం ఇస్తా అంటున్నాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి బెంజ్‌ కారు ఇస్తా అంటూ ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) మోసం చేయడానికి బయల్దేరాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి.. ఇది చేస్తా అది చేస్తా అంటాడే తప్ప సీఎంగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని మాత్రం అడగలేడు. మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషికి లేనే లేదు కాబట్టి ఓటేయండని అడగలేక పోతున్నాడు.’ అని సీఎం జగన్‌ విమర్శించారు.

వీళ్లేం మన ప్రత్యర్థులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిత్తులు, ఎత్తులు, పొత్తులనే నమ్ముకున్నారని సీఎం జగన్ ఆరోపించారు. రెండు పక్కల కూడా రెండు పార్టీలు లేకుంటే చంద్రబాబు నిలబడలేడని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోని టీడీపీ చెత్త బుట్టలో పడేస్తోందన్నారు. ‘చంద్రబాబుది పెత్తందారుల పార్టీ. దుష్టచతుష్టయాన్నే ఆయన నమ్ముకున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేసిన మంచిని చంద్రబాబు చూపించలేకపోయారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే దొంగల ముఠాకు అధికారం కావాలి. దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే వీళ్లకు అధికారం కావాలి. రెండు పక్కల రెండు పార్టీలు ఉంటేగానీ నిలబడలేని చంద్రబాబు 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి అంట.’ అని సెటైర్లు వేశారు. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యి కూడా.. తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యాను చూసి మురిసిపోతూ తాను కూడా ఎమ్మెల్యే అవుతానంటూ , తననెవరు ఆపుతారో చూస్తానని అనే ప్యాకేజీ స్టార్‌.. దత్తపుత్రుడు మరో వంక. వీళ్లు మన ప్రత్యర్థులంట అని సీఎం జగన్ విమర్శించారు.

మీ బిడ్డ నమ్ముకుంది ప్రజలనే

‘గజదొంగల ముఠా.. తోడేళ్ల ముఠాతో ఒంటరిగానే మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలన్నారు. మీ బిడ్డ రాజకీయాల్లో ప్రజలనే నమ్ముకున్నాడు. అబద్ధాలను, అవాస్తవాలను నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అండగా నిలవండి.’ అని యావత్‌ ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ కోరారు.

Advertisement

Next Story