Kodi Pandalu : పల్నాటి, బొబ్బిలి యుద్దాలకు దారితీసిన కోడి పందాలు

by M.Rajitha |
Kodi Pandalu : పల్నాటి, బొబ్బిలి యుద్దాలకు దారితీసిన కోడి పందాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కోడి పందాలు(Kodi Pandalu) అనగానే ఏపీ(AP)లోని ఉభయగోదావరి జిల్లాలు(Godavari Districts) గుర్తుకొస్తాయి. కానీ, శతాబ్దాల కిందటే జరిగిన పల్నాటి కోడి పందాలు జనం మదిలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. కోడి పందాల కారణంగానే పల్నాడు యుద్ధం(Palnati War)లో నెత్తురుపారింది. అయితే పల్నాడు రాజుల కోడిపందాల పోరులో బలైంది మాత్రం తెలంగాణ కోడిపుంజు చిట్టిమల్లు కావడం ఆసక్తి కరం. ఒకప్పుడు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు పాలించేవారు. గురజాల ప్రాంతాన్ని నలగామరాజు(NalagamaRaju) ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగామరాజు వద్ద నాగమ్మ(Nagamma) మంత్రులుగా పని చేసేవారు. రాజ్యాల మధ్య ఆధిపత్య ఆక్రమణల కుట్రలలో భాగంగా బ్రహ్మనాయుడు, నాగమ్మలు తమ కోళ్లతో పందాలు ఆడారు. బ్రహ్మన్న ఓడిపోతే ఏలేశ్వరం (నేటి నాగార్జునసాగర్ ప్రాంతం) దాటి ఏడేండ్లు, నాగమ్మ ఓడితే చిట్యాల రేవు(నల్లగొండ కృష్ణా తీరం) గుండా మూడున్నరేండ్లు రాజ్యం వదిలి వెళ్లిపోవాలన్నది నాటి ఒప్పందం. అయితే నాయకురాలి నాగమ్మ కోడి పుంజు నల్లమల్లును ఓడించే పుంజు బ్రహ్మనాయుడి దగ్గర లేదు. పోరులో గెలిచే శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును నల్లగొండ కుందూరు చోడుల రాజధానిగా ఉన్న పానగల్లు పట్టణంలో చూసినట్టు అతని సోదరుడు బాదన్న చెప్తాడు. దాన్ని తీసుకురావాలని అనుచరుడు వీరపడాలును పంపిస్తాడు. నాటి రేవు ప్రాంతమైన చిట్యాల (నల్లగొండ జిల్లా) దగ్గర కృష్ణానదిని దాటి, అడ్డుకున్న ఇక్కడి సైనికులను చంపి పానగల్లుకు చేరుకుని చిట్టిమల్లును తీసుకెళ్లినట్లుగా ‘పల్నాటి వీరచరిత్ర’లో రాశారు.

క్రీ.శ 11-12 శతాబ్దాల్లో కాకతీయుల సామంతులు కుందూరు చోడుల రాజధానిగా పానగల్‌ పట్టణం విలసిల్లింది. ఇక్కడ చారిత్రాక పచ్చల, ఛాయ సోమేశ్వరాలయాలు, ఉదయ సముద్రం చెరువు ఆనాటి వైభావన్ని ఇప్పటికి కళ్లముందుంచుతాయి. కాగా పల్నాటి కోడి పందాల పోరులో బ్రహ్మనాయుడి తరుపుని బరిలోకి దిగిన చిట్టిమల్లు మొదటి పందెంలో నాగమ్మ పందెం కోడి నల్లమల్లును మట్టికరిపిస్తుంది. రెండో పందెంలో నాగమ్మకే చెందిన రెండో పందెం కోడి ‘సివంగి డేగ’ చేతిలో చిట్టిమల్లు చనిపోతుంది. దీన్ని మాచర్ల రాజులు అవమానంగా భావించడంతో చిలికిచిలికి గాలివానగా మారి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. గురజాల, మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతంలో కోడేరుగుట్టల వద్ద ఈ కోడిపోరు జరిగినట్టుగా చారిత్రక రచనల్లో ప్రస్తావన ఉంది. నాగమ్మ రెండో పందెంలో కోడి పుంజును మార్చగా, బ్రహ్మన మాత్రం రెండో పందెంలోనూ చిట్టిమల్లునే బరిలోకి దించడంతో తొలిపోరులో అలిసిన చిట్టిమల్లు రెండో పోరులో ఓడిపోయిందంటారు. అయితే జానపద కథలో మాత్రం నాగమ్మ తన కోడి పుంజు కాళ్లకు కత్తులు కట్టిందని అందుకే చిట్టిమల్లు ఓటమిపాలై చనిపోయిందన్న ప్రచారం వినిపిస్తుంటుంది.

బొబ్బిలి యుద్ధం(Bobbili War) కూడా ఇలాగే కోడిపందాల వల్లే జరిగింది. ఒకప్పుడు బొబ్బిలి, విజయనగర పుంజులు పోటీ పడ్డాయి. బరిలో తొలుత బొబ్బిలి పుంజులు గెలవడంతో విజయనగరరాజులు ఆగ్రహించారు. ఇక్కడ కూడా ఆఖరి బరిలో బొబ్బిలి రాజుల పుంజే గెలిచింది. అవమానంగా భావించిన విజయనగర రాజుల కోపం కట్టలు తెంచుకుందని చెబుతుంటారు. ఇది చివరకు యుద్ధానికి దారి తీసింది.

Advertisement
Next Story

Most Viewed