- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీలో 'జోష్'.. క్షేత్రస్థాయిలో సందడి
'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. అభివృద్ధి అన్నది శూన్యం.. అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారు.. రాష్ట్రంలో ఏకపక్ష పాలనతో ప్రజాస్వామ్యానికి హాని జరుగుతోంది.. ఒక్క ఛాన్స్ అంటూనే రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తొక్కి పడేశారు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది' ఇలా ప్రతి చోటా ఇదే రకమైన ఊకదంపుడు ఉపన్యాసాలతో అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ క్యాడర్‌లోనూ చెవిలో జోరీగ లాగా ప్రసంగాలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాచిక పారినట్లే కనిపిస్తోంది.
దిశ ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ ఇవి కేవలం ఉపన్యాసాలు మాత్రమేనని, అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ విమర్శించడం, తిట్టడం మామూలేనని నమ్మిన జనాన్ని సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో చంద్రబాబు చెబుతోన్నవి అన్నీ నిజమేనేమో అని నమ్మేలా, భ్రమించేలా చేయడంలో చంద్రబాబు సఫలం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడి వాణినే పలు సమావేశాల్లోనూ, సదస్సుల్లోనూ, ఇష్టాగోష్టులలోనూ, రచ్చబండల వద్ద బలంగా వినిపించేలా చేసిన పార్టీ క్యాడర్ వ్యూహం కూడా ఫలించినట్టేనన్న చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అధికార పార్టీపై ప్రజల్లో నెలకొని ఉన్న అసమ్మతి, అసంతృప్తి నిజమేనని ఈ ఎన్నికల ద్వారా నిజమయ్యిందన్న పార్టీ క్యాడర్ ప్రచారాన్ని ప్రజలు కొంత విశ్వసించే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నిలదొక్కుకోవడానికి, అదే ఊపుతో ప్రజల్లోకి వెళ్లడానికి ఈ గెలుపు ఎంతగానో దోహదపడిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. తాజాగా నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కూడా ఈ గెలుపు ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు కూడా భావిస్తూ ఉండడం గమనార్హం. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోందని పార్టీ నాయకులు అంటున్నారు.
క్షేత్రస్థాయిలో మొదలైన సందడి
అధికార పార్టీ చెబుతోన్న ప్రకారం ప్రజల ముంగిటకే సేవలు .. ఇంటింటికీ వలంటీర్ సర్వే .. సమస్యలు అన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే తక్షణమే పరిష్కారం అంటూ చెబుతూ వస్తోండగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం కొంతవరకూ డీలా పడిన విషయం వాస్తవమే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధించడం తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి శ్రేణుల్లో సందడి మొదలయ్యేలా చేసింది. ఇదే ఉత్సాహాన్ని, విజయ సంబరాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయడంలో పార్టీ శ్రేణులు కొంత వరకూ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌లో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన వేపాడ చిరంజీవిని (ఇతనికి ఎకనమిక్స్ చిరంజీవిగా పేరు ఉండడం) అభ్యర్థిగా ఎంపిక చేయడం, రెండవ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దామాషా ప్రాతిపదికన గెలవడం (పార్టీలో నెలకొన్న అసంతృప్తి, పార్టీ ఫిరాయింపులు లాంటి వాటిని పక్కన పెడితే) లాంటి విషయాల గురించి అటు పార్టీ క్యాడర్, ఇటు ప్రజలు ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీ అభ్యర్థులు గెలిచారా లేదా అన్న కోణంలోనే ఆలోచిస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాలను నమ్మేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొదటి నుంచీ పార్టీ అధిష్టానం చెబుతోన్న ప్రకారం దానినే పార్టీ క్యాడర్ కూడా వల్లె వేయడం అది ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయడంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం కొంతవరకూ ఫలించినట్టేనన్న ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీలోని క్షేత్రస్థాయి క్యాడర్‌లో ఈ ఎన్నికల గెలుపు ఎంతో ఉత్సాహాన్ని నింపిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని పార్టీలోని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు.
పార్టీలోనూ, ప్రజల్లోనూ అసంతృప్తి ఉందని నమ్మిన క్యాడర్
అధికార పార్టీ అన్న తరువాత అసంతృప్తి అన్నది సర్వ సాధారణం.. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ద్వారా ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్ లోనూ విపరీతమైన అసంతృప్తి, అసమ్మతి ఉందని ప్రజలను నమ్మించడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కొంతవరకూ సఫలం అయినట్టేనని చెప్పవచ్చు. వారు చేస్తోన్న ప్రచారంలో వాస్తవం ఉందని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించిందని కొంతవరకూ ప్రజలు నమ్మినట్లుగానే భావించవచ్చని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. అందుకే ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం ద్వారా ప్రజల మనస్సులను అధికార పార్టీ నుంచి మరల్చవచ్చన్న భావనతో పార్టీ శ్రేణులను ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో సందడి చేసుకుంటూ అధికార పార్టీ అక్రమ వ్యవహారాలను, ఆధిపత్య ధోరణులను ఎంత బలంగా వీలైతే అంత బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలాగా చేయడానికి వ్యూహం రచిస్తోన్నట్లు సమాచారం. ఇలా చేయడం వలన యువగళం పాదయాత్రకు కూడా మరింత బలం చేకూరుతుందన్న భావనతో పార్టీ అధిష్టానం, ముఖ్య శ్రేణులు భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ప్రచారాన్ని ఆపడంలో వెనకబడ్డ వైసీపీ?
ఇలా అధికార పార్టీ పైనా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పైనా తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ, ఆపడంలోనూ అధికార వైసీపీ విఫలమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవికి ఉన్న వ్యక్తిగత ఛరిష్మా, రెండవ ప్రాధాన్యత ఓట్ల గురించి ఓటర్లకు ఉన్న సరైన అవగాహన లేకపోవడంతో, రెండవ ప్రాధాన్యత ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో వైసీపీ శ్రేణులు విఫలమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే ఎన్నికల కోటాలో కూడా దామాషా ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్సీ వచ్చిందని అటు ప్రజలకు చెప్పడంలోనూ పార్టీ క్యాడర్ విఫలమయినట్లు పార్టీలోని సీనియర్ ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. (అయితే ఇక్కడ తెలుగుదేశం, వైసీపీలలో నెలకొన్న అసంతృప్తి, ఆధిపత్యపోరు, పార్టీ ఫిరాయింపులు లాంటి వాటిని పక్కన పెడితే). ఇలా ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ప్రజలలో అధికార పార్టీ పట్ల విపరీతమైన అసంతృప్తి, అసమ్మతి ఉండడం మూలంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని పెద్దయెత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దీనిని తిప్పి కొట్టడంలో మాత్రం పూర్తిగా వైసీపీ శ్రేణులు విఫలమయ్యాయని భావించడం వల్లనే ప్రజలు తెలుగుదేశం పార్టీ చెబుతున్నది నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమయినప్పటికీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతూ పెద్ద ఎత్తున ప్రజలను నమ్మించే పనిలో నిమగ్నమై ఉండడం గమనార్హం.
Also Read..
జగన్ కోటకు బీటలు.. ఎమ్మెల్యేల తీరుతో తలలు పట్టుకునే పరిస్థితి
- Tags
- MLC election
- TDP