ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

by samatah |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
X

సీఎం జగన్ పరిభాషలో చెప్పాలంటే.. దేవుడి స్క్రిప్టు మారిపోతోంది. 2019తో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నాటి ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న జగన్.. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ ఆర్భాటంగా చెప్పుకున్నారు. నాలుగేళ్లలోనే జగన్ వ్యవహారశైలి అందరికీ బాగా అర్థమైంది. దాని ఫలితంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి దెబ్బమీద దెబ్బ పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలనూ గెలుచుకునేందుకు ఆయన పన్నిన వ్యూహాలన్నీ రివర్స్ అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి పడిన నాలుగు ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. అధికారం దర్పంతో నియంతృత్వ పోకడలు పోతున్న వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బే.

దిశ, ఏపీ బ్యూరో : అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడింది. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. మూడు సీట్లు కోల్పోయింది. ఆ రోజు నుంచి పార్టీ అధినేత, సీఎం జగన్​మరింత పకడ్బందీగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దమయ్యారు. ఎమ్మెల్యేలకు క్యాంపులు పెట్టారు. మంత్రులను ఇన్​చార్జులుగా నియమించారు. అనుమానం ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టారు. అయినా పార్టీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు క్రాస్​ఓటింగ్​చేసి టీడీపీని గెలిపించారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్​రెడ్డిలను పార్టీ అధిష్టానం అనుమానిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఇంతటి వ్యతిరేకత ఎందుకు వచ్చిందనే కోణంలో జగన్​ఆలోచిస్తారా ? తదుపరి ఏం చర్యలు తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

హెచ్చరికలతో గుబులు

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో సీఎం జగన్​ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు, మంత్రులకు ర్యాంకులు ఇస్తూ వచ్చారు. సరిగ్గా నిర్వహించని వాళ్లను హెచ్చరిస్తూ వచ్చారు. అందులో భాగంగా మొదటి సమీక్ష అనంతరం సుమారు 40 మంది పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని సదరు ఎమ్మెల్యేలకు వార్నింగ్​ఇచ్చారు. ఆ తర్వాత రెండో విడత సమీక్ష సందర్భంగా సుమారు 20 మంది పనితీరుపై సీఎం జగన్​తీవ్రంగా స్పందించారు. ఇలాగే ఉంటే అసలు సీటు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పేశారు. కేవలం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారనేది కూడా పార్టీలో గుసగుసలు వినిపించాయి. మూడో విడత సమీక్ష తర్వాత కొందరైతే ఇక తమకు సీటు దక్కదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కొంపముంచిన ఇన్ చార్జులు?

గడప గడపలో ఎవరైతే వెనుక పడ్డారో.. మరెవరైతే పార్టీపై అసంతృప్తితో ఉన్నారో వాళ్ల నియోజకవర్గాల్లో అదనపు ఇన్​చార్జిని పెట్టాలని తొలుత భావించారు. మొట్టమొదట గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి డొక్కా మాణిక్యవరప్రసాదును నియమించారు. దీంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, డొక్కా అనుచరుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే అనుచరులు బహిరంగ నిరసనలకు దిగారు. అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డికి పోటీగా నెదురుమల్లి రాంకుమార్​రెడ్డిని రంగంలోకి దించారు. ఎమ్మెల్యే ఉన్నచోట ఇన్​చార్జిని పెట్టడమేంటని ఆనం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​రెడ్డి కుటుంబ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన నియోజకవర్గానికీ ఓ ఇన్​చార్జిని నియమించారు. అక్కడ కూడా పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ తీరును చంద్రశేఖర్​రెడ్డి బహిరంగంగానే ఎండగట్టారు. ఇలా పార్టీపై అసంతృప్తితో ఉన్న వాళ్లను పిలిచి చర్చించినట్లు లేదు. ఎదురుదాడికే జగన్​ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం దొరకని దర్శనం..

సీఎం జగన్​తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆది నుంచి కొంత అసంతృప్తి ఉంది. ఆయన ఎవ్వరికీ అప్పాయింట్​మెంటు ఇవ్వడు. ఎవరితోనూ మాట్లాడడు. కేవలం సలహాదారులు, వ్యక్తిగత సిబ్బందితోపాటు ఒకరిద్దరు మంత్రులకే సీఎంను కలిసే భాగ్యం కలిగేది. నియోజకవర్గాల్లో తమ సమస్యలు చెబుతామనుకుంటే కలిసే వీలు కల్పించడం లేదనే వెలితి ఉండేది. సంక్షేమ పథకాలను సీఎం జగన్​బటన్​నొక్కి ఇస్తున్నారు. ఆయనకే పేరొస్తోంది. మరి ఎమ్మెల్యేలకు ఎలా పేరొస్తుందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హామీల అమలు ఏదీ?

ఎన్నికలకు ముందు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు జగన్ హామీలు ఇచ్చారు. అవేవీ అమలుకు నోచుకోలేదు. కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీటి సరఫరాలాంటివి కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అసలు పాలనలో ఎమ్మెల్యేలకు జోక్యం లేకపోయిందనే విషయాన్ని గుర్తించారు. అప్పటి నుంచి గడప గడప కార్యక్రమంలో ప్రతీ సచివాలయానికి రోడ్లు, ఇతర సదుపాయాల కల్పన కోసం రూ.20 లక్షలు కేటాయించారు. ఆపాటికే చేసిన పనులకు బిల్లులు రావడం లేదనే అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. దీన్ని కొంతమేర తగ్గించడానికి ఇటీవల కసరత్తు చేపట్టారు. ఇలా చెప్పుకుంటూపోతే సీఎం జగన్​నాలుగేళ్ల నుంచి ఒంటెద్దు పోకడలతోనే నెట్టుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారనేది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం పెరిగింది. దీంతో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామనే దానిపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులతో మరింత దగ్గరగా మెలగాల్సిన సీఎం జగన్​ అదే దర్పాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి అదే దారితీసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వరుస ఓటములతోనైనా జగన్​తీరు మార్చుకుంటారా లేక మరింత దూకుడుగా అసంతృప్తి ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకుంటారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed