పిఠాపురంలో వార్ వన్‌ సైడ్.. పవన్ కల్యాణ్ మెజార్టీపైనే చర్చ!

by GSrikanth |
పిఠాపురంలో వార్ వన్‌ సైడ్.. పవన్ కల్యాణ్ మెజార్టీపైనే చర్చ!
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఓడిన పర్వాలేదు, కానీ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలువకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళిక. ఆ మేరకు యుక్తులు, కుయుక్తులు పన్నారు. కాకినాడ జిల్లాలో విశేష రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను బరిలోకి దించారు. అయినా గెలుపు ఆమడదూరంలో ఉండటంతో తన పార్టీకి చెందిన ప్రముఖులు, ఉద్దండ నేతలను రంగంలోకి దింపారు. గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ మిధున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు మండలాల వారీగా పర్యవేక్షణ భాద్యతలు అప్పగించారు. చివరాఖరి రోజుల్లో డబ్బు పంపిణీ నిమిత్తం నగదు డంప్‌ను నెల రోజుల ముందే దింపటంతో పాటు ప్రైవేటు సిబ్బందిని భారీగా దింపారు. అయినా పిఠాపురం పీఠాన్ని పవన్ కల్యాణ్‌ను నుంచి దూరం చేయలేమనే నమ్మకం బలంగా పెరగడంతో డబ్బు, బంగారం, ఇతర ప్రలోభాలకు గురి చేశారు. అయితే ఓటరు మాత్రం ఎలాంటి చిల్లర ప్రలోభాలకు లొంగలేదు. చివరకు ప్రచారం చివరిరోజున స్టేజీ మీద వంగా గీత బోరున విలపించింది. ఆ తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే ఆమె డిప్యూటీ సీఎం అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించేశారు.

ఓటింగ్ రోజు వరకు వంగా గీత ఎక్కని మెట్టు లేదు. అభ్యర్థించని గడపలేదు. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీతకు ఎదురైన పరిస్థితి చూస్తే ఈ పరిస్థితి ఎవరికి రావొద్దనే అభిప్రాయం, బాధ కలుగుతుంది. చివరకు ఓటింగ్ రోజున ప్రతీ పోలింగ్ బూత్‌ను సందర్శించి నిబంధనలకు విరుద్ధంగా ఓటు కోసం ప్రాధేయపడటం కనిపించింది. కొన్ని చోట్ల జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా గెలుపు కష్టమే అనే ఫీలింగ్ ఆమెలో రోజు రోజుకూ బలంగా నిలిచిపోయేలా సంఘటనలు చేశాయి. స్వయంగా ఓటర్లు వంగా గీతనే గాజు గ్లాస్‌కు ఓటు వేయమని చెబుతున్నారని చెప్పిన మాటలకు అమె హతాసురాలయ్యింది. అయితే పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వంగా గీతను ఓటర్లు కనీసం పోలింగ్ కేంద్రాల్లో పట్టించుకున్న దాఖలాలే లేవు. పరిస్థితిపై వంగాగీత అసహనం వ్యక్తం చేస్తూ ఒకానొక దశలో పోలీసులపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అభిమానులు, ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజించారు. కేవలం పిఠాపురం, గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేతపై వెలకట్టలేని ప్రేమను కురిపించారు. పిఠాపురం మొత్తం ఏకతాటిపైకి వచ్చి జనసైనికుడికి నీరాజనం పలికారు. పిఠాపురంలో కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను గుండెల్లో పెట్టుకొన్నారు. ఆయన నుంచి డబ్బు ఆశించకుండా ఓటు వేసేందుకు సిద్దపడ్డారు. ప్రజల అండతో వార్ వన్ సైడ్ అనే విధంగా తీర్పును చెప్పడానికి సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు గురించి పక్కన పెడితే మెజార్టీ ఏ రేంజ్‌లో ఉంటుందోననే చర్చ పిఠాపురంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో భారీగా జరుగుతున్నది.

Advertisement

Next Story