ఏపీలో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు

by Y. Venkata Narasimha Reddy |
ఏపీలో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ విధానంలో విద్యార్థుల హాజరు నమోదుచేసినప్పటికీ..కొంతకాలంగా ఈ విధానాన్ని నిలిపివేశారు. తిరిగి ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల్లోనూ ఐరిస్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు హాజరు నమోదుచేయనుంది. ఎంతమంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారో తెలుసుకునేందుకు ఈ ఐరిస్‌ హాజరు విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నవారిలో దాదాపు 40 శాతం మంది మధ్యలో ఆపేస్తున్నారని, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 57 శాతంగా మాత్రమే ఉంటోందని, ఎంబీఏ లాంటి కోర్సుల్లో అయితే 52 శాతానికి మించి ఉత్తీర్ణత నమోదుకావడం లేదని..ఈ డ్రాప్ అవుట్స్ ను నివారించి ఫలితాలను మెరుగుపరిచేందుకు ఐరిస్ విధానం అమలుకు ప్రభుత్వం మొగ్గుచూపింది.

అంతేకాకుండా బోధన రుసుముల చెల్లింపునకు కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కారణంగా విద్యార్థులకు ఆ స్థాయిలో హాజరు ఉండేలా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఐరిస్‌ హాజరుతో బోధన రుసుముల చెల్లింపుల్లోనూ కచ్చితత్వం రానుందని ప్రభుత్వం భావిస్తుంది. ఐరిస్‌ హాజరును జ్ఞానభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయనుంది. విద్యార్థుల ఐరిస్‌ను ఒకసారి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆ వివరాలు మూడేళ్ల వరకు అందుబాటులోనే నిక్షిప్తమై ఉంటాయని, తరగతిలో యాప్‌ ఆన్‌ చేసి, విద్యార్థి వద్ద పెడితే వివరాలు ప్రత్యక్షమవుతాయని, వాటిని ఓకే చేస్తే హాజరు నమోదు పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed