ఏపీలో భారీ వర్షం..పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం

by Jakkula Mamatha |
ఏపీలో భారీ వర్షం..పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
X

దిశ, ఏలూరు:గత కొద్ది రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో సతమతమైన ఏలూరు జిల్లా ప్రజానీకం మంగళవారం వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షంతో తెరిపినబడ్డారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. ఉష్ణోగ్రత ఏ మాత్రం తగ్గకపోవడంతో జనం నిట్టూర్చారు. కాసింత చల్లగాలి, రెండు చినుకులతో ఎండ వేడిమి నుంచి తెప్పరిల్లారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పెదవేగి, భీమడోలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ మండలాల్లో పలు చోట్ల రహదారులపై చెట్లు కూలిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎస్సీ పేట లో నివాసముంటున్న దడాల శ్రీను కి చెందిన ఇల్లు మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోయింది.

అదే సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయంతో బైటకు పరుగుతీసారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దుకాణాలపై చెట్లు కొమ్మలు పడ్డాయి. పంగిడిగూడెం లక్కవరం మధ్యలో రోడ్‌పై చెట్టు కూలడంతో ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా లేని దారి లేకుండా పోయింది. చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ అధికారులకు ఫోన్‌ చేసి కూలిన చెట్లను రహదారుల నుండి తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని ఆదేశించారు.

భీమడోలు మండల పరిధిలో మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు నివాస గృహాల పై భాగాలు గాలికి ఎగిరిపోయాయి. భీమడోలు జంక్షన్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ స్థితిలో ఏ ప్రాంతంలో గొయ్య ఉందో తెలియని పరిస్థితి నెలకోవటంతో ద్విచక్ర వాహనదారులు స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈదురుగాలుల తాకిడికి భీమడోలు జంక్షన్ లో ట్రాఫిక్ నియంత్రణ కు ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీస్ అవుట్ పోస్ట్ ఎగిరిపోయింది. డ్రైనేజీ ప్రాంతంలో పడిపోయింది. పెదవేగి మండలం లో పలు చోట్ల ఈదురుగాలులకు తోడు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడ్డాయని పెదవేగి వాసులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed