- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Graduate Mlc Election: ఆ లెక్కే వేరు.. గ్రాడ్యుయేట్స్ ఓట్ల కౌంటింగ్ రేపే..

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో గత నెల 27న జరిగిన ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ రేపు జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Graduate Mlc Election) ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఇన్‌ఛార్జ్ లు, పర్యవేక్షణ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా ఉమ్మడిగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. అధికారులు అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటుచేయగా, 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆంధ్ర యూనివర్సిటీలోని ట్రిపుల్-ఈ బిల్డింగ్ లో జరగనుంది. ఈ మూడు ఫలితాలు తేలడానికి దాదాపు సుమారు 12 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, సాధారణ ఓట్ల లెక్కింపునకు చాలా తేడా ఉంటుంది. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థికి మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికంటే ఎక్కువ వస్తే అతనిని విజేతగా ప్రకటిస్తారు. అదెలాగంటే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు లక్ష అనుకుందాం.. వాటిలో గెలిచిన వారికి 50వేల ఒక ఓటు రావాలి. అంటే సగం కంటే ఒక్కటి ఎక్కువ అన్నమాట. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్క్‌ను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ అవలంబిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్యను బట్టి అభ్యర్థుల ఆరోహణ క్రమంలో జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను గుర్తించి వరుసగా ఎలిమినేట్(eliminate) చేస్తారు. జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలుపు మార్కును చేరుకునే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో లెక్కింపునకు ఎంత సమయం పడుతుందో చూడాలి.