Sajjala Ramakrishna: అపోహలొద్దు... కట్టుబడే ఉన్నాం

by srinivas |   ( Updated:2023-02-15 10:16:14.0  )
Sajjala Ramakrishna: అపోహలొద్దు... కట్టుబడే ఉన్నాం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. అందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టిందని వ్యాఖ్యానించారు. అయితే విశాఖ ఒక్కటే రాజధాని అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానమిచ్చారు. మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేయాలనే మోటివ్‌తోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని, మూడు రాజధానులు చేసి తీరుతామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన పరిణామాలు భవిష్యత్‌లో జరగకూడదనే ఉద్దేశంతో నాడు శివరామకృష్ణ కమిటీ అధికార వికేంద్రీకరణ చేయాలని పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. అయితే నాడు చంద్రబాబు ఆ కమిటీ ప్రతిపాదనలను తిరస్కరించిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రం పరిధిలోనే రాజధాని నిర్ణయం

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి గందరగోళం లేదని వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని.. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రాజధానులకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. మూడు రాజధానులపై మరింత మెరుగైన విధంగా చట్టం తీసుకువస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే సీఎం వైజాగ్ వెళ్తానని ప్రకటించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఒక ప్రకటన అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ప్రకటన చేసే నైజం తమ పార్టీకి లేదన్నారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమేనని, గతంలో కేంద్రప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన విషయాన్ని ప్రత్యేంగా గుర్తు చేశారు. మూడు రాజధానుల విషయంలో ఎవరూ అపోహలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed