Ration Mafia: పల్నాడులో రేషన్ మాఫియా.. టన్నుల్లో రీ సైక్లింగ్

by Rani Yarlagadda |
Ration Mafia: పల్నాడులో రేషన్ మాఫియా.. టన్నుల్లో రీ సైక్లింగ్
X

దిశ, పల్నాడు: పల్నాడులో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోంది. కార్డులకు వందో రెండొందలో చేతిలో పెట్టి పేదల బియ్యాన్ని అక్రమార్కులు ఎడాపెడా దోచేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఈ తంతు యథేచ్చగా సాగిపోతుంది. రెండు రోజులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలతో మరలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లులో టన్నుల కొద్దీ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్న తీరును చూసి ఆయన నివ్వెరపోయారు.

భాగాలుగా పంచుకొని..

మండలాలను భాగాలుగా పంచుకున్న రేషన్ మాఫియా, దళారులతో రేషన్ బియ్యాన్ని భారీగా సేకరిస్తుంది. డీలర్లకు ముందే అడ్వాన్స్‌లు ఇచ్చేసి, ప్రతి నెల బియ్యం సేకరిస్తూ, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పేదలకు ప్రభుత్వం రూపాయికే బియ్యం అందిస్తుండగా, కార్డుదారుల నుంచి డీలర్ కేజీ రూ.8 కోనుగోలు చేసి దళారులకు రూ.15 అమ్ముతున్నట్లు తెలిసింది. వీటిని దళారులు రేషన్ మాఫియా కు రూ.30 అమ్ముతున్నట్లు సమాచారం. ఆ తరువాత నేరుగా రైస్ మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేస్తున్నారు. అనంతరం లారీల ద్వారా భారీగా కాకినాడ పోర్ట్ వెళ్తునట్లుగా తెలుస్తుంది.

కేసులు నమోదవుతున్నా డోంట్ కేర్..

ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు నమోదు చేసినా, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అధికారులకు మామూళ్లు అలవాటు చేసి, అక్రమార్కులు బరితెగించి ప్రవర్తిస్తునట్లుగా ప్రచారం సాగుతోంది. పల్నాడులో పలుచోట్ల రైస్ మిల్లులో అప్పుడప్పుడు జరిపిన విజిలెన్స్ సోదాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడుతున్నాయి. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిపై 6A కేసులైతే నమోదువుతున్నాయి. కానీ, అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

ప్రక్షాళనతోనైనా మార్పు వస్తుందా?

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించేందుకు రేషన్ డీలర్లు వ్యవస్థలో మార్పులు అవసరమని గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెడితే.. రేషన్ అక్రమ రవాణాకు బ్రేక్‌లు పడతాయని అంతా భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed