ఎమ్మెల్సీలుగా నాగబాబు, మోపిదేవి?

by D.Reddy |
ఎమ్మెల్సీలుగా నాగబాబు, మోపిదేవి?
X

దిశ, ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి (YCP)11 మంది బలం మాత్రమే ఉండటంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు. దీంతో ఆ స్థానాలన్నీ టీడీపీకే (TDP) దక్కనున్నాయి. కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుంది.

కేబినెట్ బెర్తుకే సుముఖత..

గత రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ స్థానం కోసం జనసేన నాగబాబు కోసం పట్టుబట్టింది. అయితే, ఆయన రాష్ట్ర క్యాబినెట్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తపరిచారు. దీంతో ఓ ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఖరారు కానున్నట్లు తెలుస్తున్నది. ఇక, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత మోపిదేవి వెంకటరమణారావుకు కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నా బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణా రావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రాజ్యసభ ఎన్నికలలో బీదాకు తిరిగి ఆ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు. మోపిదేవికి ఇవ్వాల్సిన రాజ్యసభ టిక్కెట్టును ఆయనకు బదులు సానా సతీశ్‌కు ఇచ్చారు. ఆ సమయంలో మోపిదేవికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ఒప్పించినట్టు సమాచారం. ఆ హామీ మేరకు మరో ఎమ్మెల్సీ ఆయనకు కేటాయించనున్నట్టు తెలిసింది. ఇక మిగిలిన మూడు స్థానాలలో పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి, మండలి మాజీ చైర్మన్ షరీఫ్, ఎస్సీ వర్గానికి చెందిన పలువురి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

వీరికి మంత్రి పదవులు!

అసెంబ్లీ సమావేశాలు మార్చి 21 వరకు జరగనున్నాయి. ఆలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. మార్చి 30న ఉగాది పండుగ జరగనుంది. ఆ రోజు ముందు లేదా తరువాత ముఖ్యమంత్రి చంద్ర బాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని టీడీపీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి విస్తరణ ఖాయమని భావిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న వారిలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ (గోదావరి ), మాధవి రెడ్డి (కడప), తంగిరాల సౌమ్య (ఎన్టీఆర్) పేర్లు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed