- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
NH 216 ఫ్లైఓవర్ పై పగుళ్లు.. తీవ్ర భయాందోళనలో ప్రయాణికులు

దిశ ప్రతినిధి, బాపట్ల: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యం వలన త్రోవగుంట-దిగమర్రు జాతీయ రహదారి NH 216 అనతి కాలంలోనే శిథిలం అవుతోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏజెంట్లు రోడ్డుపై ఏర్పడిన గుంతలు పగుళ్లకు మాసికలు వేసి మభ్యపెడుతున్నారు. ఒంగోలు-చీరాల మార్గమధ్యంలో పలుచోట్ల రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి ఇనుప ఊచలు దర్శనమిస్తున్నాయి. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం పరిధిలో ఇదే రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్ రోజురోజుకు శిథిలం అవుతుంది. వందల మీటర్ల మేర రోడ్డు నిర్మాణం పగుళ్లతో కనిపిస్తుంది. ఫ్లైఓవర్ మధ్యలో 300 మీటర్ల మేర ఆరు అంగుళాల వెడల్పులో నెర్లిచ్చి రోడ్డు రెండుగా విడిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ప్రయాణికులకు ఫ్లై ఓవర్ ఎప్పుడైనా పడిపోవచ్చు అనే భయాందోళనలు కలిగించేలా పగుళ్ళు దర్శనమిస్తున్నాయి. రోడ్డు ప్రారంభించిన 2020 నుండి ఇప్పటివరకు మరమ్మత్తుల పేరుతో అదేపనిగా మాసికలు వేసి మభ్య పెట్టడం తప్ప జాతీయ రహదారిపై ప్రయాణానికి భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదాలను నివారించుటకు జంక్షన్ లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేసి ఉండలేదు. అప్రోచ్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు వద్ద సిగ్నల్స్ కానీ లైట్లు కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తమకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈనెల 29వ తేదీన ఈపురుపాలెం ఎస్సై చంద్రశేఖర్ చొరవతో కదిలిన NHAI ప్రతినిధి మున్న మరోసారి మాసికలు కార్యక్రమం చేపట్టారు.
ఆక్రమణలకు అడ్డే లేదు. జాతీయ రహదారిపై చీరాల నుంచి ఒంగోలు వెళ్ళు మార్గమధ్యంలో పలుచోట్ల రెస్టారెంట్స్, హోటల్స్, ఆక్వా పాండ్స్ లాంటి వ్యాపార సంస్థ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్స్ ను ఆక్రమించిన కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి పలు రోడ్డు ప్రమాదాలకు కారణభూతమవుతున్నాయి. గత నాలుగేళ్లలో వందల మంది రోడ్డు ప్రమాదాలలో మరణించినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారిలో ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేటపాలెం జంక్షన్ లో కోడూరు ఆనందరాజు అనే వ్యక్తి జాతీయ రహదారిపై బస్సు షెల్టర్ నిర్మాణం పేరుతో అడ్డగోలుగా విరాళాలు వసూలు చేసి డ్రైన్ పూడ్చి వేసినప్పటికీ ఈరోజు వరకు అతనిపై ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టి ఉండలేదు. పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జంగిల్ కేఫ్ రెస్టారెంట్ 500 మీటర్ల పొడవునా జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమించి, విద్యుత్ పోల్స్, షెడ్లు నిర్మించినప్పటికీ కనీసం కన్నెత్తి కూడా చూడ లేని దయనీయ దుస్థితిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది.
ప్రభుత్వాన్ని అడుక్కోండి ..
జాతీయ రహదారి నిర్మించిన అతి తక్కువ కాలంలో ధ్వంసం అవుతున్న విషయమై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్ మున్నా అనే వ్యక్తిని (85199 44336 మొబైల్ నెంబరు) 'దిశ' వివరణ కోరే ప్రయత్నం చేయగా, "నాకేమీ తెలియదు, నేనే రిపేర్లు చేపిస్తున్నాను, మీకేం సమాచారం కావాలన్నా ప్రభుత్వాన్ని అడుక్కోండి, మీకెందుకు సమాధానం చెప్పాలంటూ" అంటూ తల బిరుసు గా మాట్లాడటం బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది.
బుట్ట దాఖలైన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు..
జాతీయ రహదారిపై ఆక్రమణలపై చేసిన పలు ఫిర్యాదులపై మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ & హైవేస్ ఆదేశాలను సైతం బుట్ట దాఖలు చేసిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఆక్రమణదారుల మామూళ్లకు అలవాటు పడి మౌనం వహిస్తున్నారు. జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త నందు నమోదైన ఫిర్యాదులో విచారణలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రాజెక్టు డైరెక్టర్ తో సహా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం లో ఎలాంటి చలనం కనిపించకపోవడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.