AP News: ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి:మంత్రి దుర్గేష్

by Jakkula Mamatha |
AP News: ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి:మంత్రి దుర్గేష్
X

దిశ,వెబ్‌డెస్క్: విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ రోజు (శనివారం) ఉదయం రాజమహేంద్రవరంలోని వై జంక్షన్‌లో తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో 14 డిసెంబర్, 2024 నుంచి 20 డిసెంబర్, 2024 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్‌ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామని ఇంధన ప్రాముఖ్యతను, ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపు పై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడదాం తద్వారా 60 శాతంకు పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. ‘నేటి సత్సంకల్పం.. రేపటి వెలుగుల సహకారం’ అని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా చేయవచ్చు అని సూచించారు. అంతేగాక కరెంట్‌ను ఆదా చేస్తే భావితరాలకు భరోసానిచ్చిన వారవుతామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు.

సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంధనం పొదుపు వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోల్ విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. క్రమంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూనే సౌర శక్తిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇంటి పై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకొని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధనం పొదుపు విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed