బిగ్ న్యూస్: ఏపీ బీఆర్ఎస్‌లో లుకలుకలు.. ఆదిలోనే నేతల మధ్య అసంతృప్తి రాగం!

by Satheesh |
బిగ్ న్యూస్: ఏపీ బీఆర్ఎస్‌లో లుకలుకలు.. ఆదిలోనే నేతల మధ్య అసంతృప్తి రాగం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే లుకలుకలు ప్రారంభం అయ్యాయా..? ఆదిలోనే గడ్డు పరిస్థితి నెలకొన్నదా..? పార్టీలోని ముగ్గురు నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒకరి అభిప్రాయాలను మరొకరు విభేదిస్తుండటంతో ఏపీలో పార్టీ విస్తరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్‌కు సైతం రాకపోవడంతో నేతల మధ్య అసంతృప్తి బహిర్గతమైంది. అన్నీతానై తోట ఒక్కరే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండటం, అధినేత కేసీఆర్ పక్క రాష్ట్రంపై దృష్టిసారించకపోవడం, పార్టీ ఆవిర్భవించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కీలక నేతలు చేరకపోవడం రాజకీయవర్గాలతోపాటు పార్టీలోనూ చర్చనీయాంశమైంది.

చేరికలపై నో రెస్పాన్స్

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. గతేడాది డిసెంబర్ 9న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తెలుగువారున్న ఆంధ్రప్రదేశ్‌పై మొదట కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది జనవరి 2న ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారధి బీఆర్ఎస్‌లో చేరారు.

ఆ తర్వాత పార్టీని ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తామని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇక ఏపీలో నేతలు బిజీబిజీ అవుతారని కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఆ దిశగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. బీఆర్ఎస్‌లో చేరేందుకు ఏ పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. కనీసం కిందిస్థాయి కేడర్ సైతం చేరకపోవడం గమనార్హం.

అంతేకాదు.. గత నెల 21న ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించారు. పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆ ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. అంతేకాదు ఏపీ బీఆర్ఎస్ నాయకులు రావెల కిశోర్ బాబు, పార్థసారధి సైతం పాల్గొనకపోవడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. దీంతో ఏపీలో తోట ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు.

ఏపీపై దృష్టిసారించని కేసీఆర్

బీఆర్ఎస్ ఆవిర్భావం మొదట ఏపీలోని విశాఖ, గుంటూరుతోపాటు పలు ప్రాంతాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. సభ నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అదే విధంగా విశాఖ స్టీల్ ప్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులకు మద్దతుగా ఉద్యమం, సభ నిర్వహిస్తారని లీక్ ఇచ్చారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందు బిడ్డింగ్‌లోనూ పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధికారుల బృందాన్ని పంపారు. కానీ.. చివరకు పాల్గొనలేదు.

సభలు, సమావేశాలను సైతం ఇప్పటివరకు నిర్వహించలేదు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న దోస్తీతోనే ఆ రాష్ట్రంపై దృష్టిసారించడం లేదనే ప్రచారం సైతం జరుగుతోంది. పక్క రాష్ట్రంపైనే దృష్టిసారించని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా కీలకభూమిక పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed