ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఏనుగుల సంచారం కారిడార్‌గా ఉన్న నేపథ్యంలో వాటిని పరిరక్షించుకోవడంతో పాటుగా, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడటం కోసం కృషి చేయనున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో నేడు(శుక్రవారం) విజయవాడలో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకొని ఎం.ఓ.యూ. కుదుర్చుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగుల దాడులను అరికట్టడానికి కుంకి ఏనుగులను, వాటికి శిక్షణ అందించే మావటీలను అందించడంతో పాటు, ఏనుగు శిబిరం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన కర్ణాటక అటవీ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి అటవీ శాఖ సంబంధిత అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. వారి రియల్ టైం ట్రాకింగ్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతున్న కదలికలతో పాటుగా, వన్యప్రాణుల రక్షణ, ప్రకృతి వనరుల దోపిడీ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది అని పవన్ అన్నారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా, కర్ణాటకలో శ్రీ గంధం అక్రమ రవాణా జరుగుతుంది. సరిహద్దుల గుండా అక్రమ రవాణా జరగకుండా ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. సమస్యను వివరించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏనుగుల సమస్యను, ఇతర అటవీ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను, సరిహద్దుల వద్ద అక్రమ ఎర్రచందనం, శ్రీ గంధం రవాణా, వన్యప్రాణుల సంరక్షణ అంశాలపై ఉమ్మడి సహకారానికి ముందుకు వచ్చిన కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కర్ణాటక తరహాలో ఎకో టూరిజం సెంటర్ అభివృద్ధి చేస్తున్నాము. దీని ద్వారా టూరిజం అభివృద్ధితో పాటుగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పని చేస్తున్నాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రెండు వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం, ప్రకృతి సంరక్షణ కోసం కదిలి వచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల ఎదుర్కొంటున్న అటవీ శాఖ పరమైన సమస్యల పై ఉమ్మడిగా పనిచేస్తాము అని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed