స్విమ్మింగ్ లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన కానిస్టేబుల్ నాగ బ్రహ్మారెడ్డి

by Ramesh Goud |
స్విమ్మింగ్ లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన కానిస్టేబుల్ నాగ బ్రహ్మారెడ్డి
X

దిశ ప్రతినిధి, బాపట్ల: పోలీస్ సిబ్బంది క్రీడలలో సత్తాచాటాలని, క్రీడలలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా చందోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్ లో సాధించిన మెడల్స్ తో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. బాపట్ల జిల్లా చందోలు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పిట్టు నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీలలో సత్తా చాటాడు.

దుర్గా ఘాట్ నుండి ఈదుకుంటూ 1.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 2025 మార్చి 24 నుండి 28 వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2024-2025 పోటీలలో పాల్గొని సత్తా చాటినాడు. ఇతడు గతంలో కూడా స్విమ్మింగ్ పోటీలలో 4 మెడల్స్ సాధించాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చందోలు కానిస్టేబుల్ పిట్టు నాగ బ్రహ్మారెడ్డి స్విమ్మింగ్ పోటీలలో సత్తాచాటి మెడల్స్ గెలిచి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమన్నారు.

గతంలో కూడా 4 మెడల్స్ గెలుపొందినాడన్నారు. ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ, గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది బ్రహ్మారెడ్డి స్ఫూర్తితో క్రీడలలో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రోత్సహిస్తామని ఎస్పీ తెలిపారు.



Next Story

Most Viewed