మీ మనసు నొప్పించం...ఉమ్మడి పౌరస్మృతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Seetharam |   ( Updated:2023-07-19 12:40:46.0  )
మీ మనసు నొప్పించం...ఉమ్మడి పౌరస్మృతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,డైనమిక్ బ్యూరో : ‘వైసీపీ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదు. ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్‌ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు’ అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం మతపెద్దలతో అన్నారు. ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి. ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు? మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని మనం అంతా స్పష్టం చేద్దాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘భారతదేశం చాలా విభిన్నమైనది. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వారివారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయి’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లాబోర్డుల ద్వారానే చేయాలి. Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా ఒకవేళ మార్పులు అవసరమైతే జరగాలి తప్ప వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న మన దేశంలో తగదు’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story