ఎన్టీఆర్‌కు భారతరత్న.. సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్

by srinivas |
ఎన్టీఆర్‌కు భారతరత్న.. సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే తెలుగు జాతిని గౌరవించడమని, ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామని, సాధిస్తామని సీఎం చంద్రబాబు చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ పోరంకి మురళి రిసార్ట్స్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. 'తారక రామం- అన్నగారి అంతరంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ 300 చిత్రాల్లో నటించి, ప్రతి పాత్రలో జీవించారన్నారు. ఆయనలా వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్ రూపంలో మనం దేవుడిని చూస్తున్నామని, అన్ని రకాల పాత్రలు పోషించి ప్రజలను మెప్పించారని పేర్కొన్నారు. పరిశోధన చేసి మరీ వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీనాథుడు పాత్రలు పోషించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే అని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే ఇప్పటి వరకు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు. ‘‘జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రాయలసీమలో కరువు, దివిసీమలో తుపాను వచ్చినప్పుడు జోలిపట్టి విరాళాలు సేకరించారు. సమాజమే దేవాలయం..పేదలే దేవుళ్లని చెప్పారు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రజల కల అని, అది సాధించే శక్తి మన దగ్గర ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed