Tirumala News:లడ్డూ తయారీకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడండి: టీటీడీ ఈవో

by Jakkula Mamatha |
Tirumala News:లడ్డూ తయారీకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడండి: టీటీడీ ఈవో
X

దిశ,తిరుమల:నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహకిషోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు.

అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈవోకు విన్నవించారు. అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్దనుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. అధికారులు, పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తర్వాత, ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను (శాంపిల్స్)తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో (పోటు) శ్రీనివాసులు, విశ్రాంత ఏఈవోలు శ్రీనివాస్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.


Next Story