ఆలయం పక్కగా వెళ్లిన హెలికాప్టర్లు..ఆందోళనలో శ్రీవారి భక్తులు

by Jakkula Mamatha |   ( Updated:2024-03-12 11:10:04.0  )
ఆలయం పక్కగా వెళ్లిన హెలికాప్టర్లు..ఆందోళనలో శ్రీవారి భక్తులు
X

దిశ, తిరుమల :శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం పక్కన రెండు హెలికాప్టర్లు వెళ్లడం కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయం పై ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం విమాన రాకపోకలు జరగకూడదని పండితులు పదేపదే చెబుతున్నప్పటికీ శ్రీవారి ఆలయం మీదుగా తరచు విమానాలు, హెలికాప్టర్లు వెళుతున్నాయి. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల క్రితం శ్రీవారి ఆలయం పైన ఓ విమానం వెల్లగా, తాజాగా సోమవారం ఉదయం శ్రీవారి ఆలయ మహాగోపురం పక్కన రెండు హెలికాప్టర్లు వెళ్లడం పైన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అధ్యక్షుడు భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ఇచ్చే పరిస్థితి లేదని సాక్షాత్తు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తేల్చి చెప్పిందంటూ ప్రకటించారు. అదే సమయంలో శ్రీవారి ఆలయ మహా గోపురం పక్కగా రెండు హెలికాప్టర్లు వెళ్లడం సర్వత్ర భక్తులనే కాక టీటీడీ అధికారులను సైతం ఉలిక్కిపడేలా, ఆందోళనకు గురి చేసింది. దీనిపై ఆలయ ఆగమ శాస్త్ర పండితులు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో తరచూ విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతిసారి తిరుమల వాసులు ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్లు ఎగరకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed