Tirumala:శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలకు స‌ర్వం సిద్ధం.. ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-08 15:37:31.0  )
Tirumala:శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలకు స‌ర్వం సిద్ధం.. ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు
X

దిశ, తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 09వ తేదీ ఆదివారం రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 07 నుంచి 08 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి.

ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప‌చుట్టూ నీటిజ‌ల్లులు(ష‌వ‌ర్‌) ప‌డేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్స‌వాల్లో అలంక‌ర‌ణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా, భ‌ద్ర‌తా సిబ్బంది ఆధ్వ‌ర్యంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచారు.

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహ రాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్ళపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు

తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10 వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


Read Also..

ఏసీబీ అధికారులమంటూ ఫోన్.. రెవెన్యూ ఉద్యోగులకు సైబర్ నేరగాళ్ల టోకరా

Next Story

Most Viewed