చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ తప్పుడువి...రెగ్యులర్ బెయిలివ్వొద్దు: ఏఏజీ పొన్నవోలు

by Seetharam |
చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ తప్పుడువి...రెగ్యులర్ బెయిలివ్వొద్దు: ఏఏజీ పొన్నవోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయవద్దు అని సీఐడీ ఏపీ హైకోర్టును కోరింది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులలో తప్పులు ఉన్నాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. స్కిల్ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీమెన్స్ కంపెనీ కుంభకోణం జరిగిందని..నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

చంద్రబాబును ఇరికించే కుట్ర: సిద్ధార్థ లూథ్రా

చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు గుండె, చర్మ సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారని ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగిందని..ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని...దానికి మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని అందువల్లే రెగ్యులర్ బెయిల్ కోరుతున్నట్లు హైకోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Advertisement

Next Story