చంద్రబాబు కేసు: ఏఏజీ పొన్నవోలు వాదనలపై న్యాయమూర్తి అసహనం

by Seetharam |   ( Updated:2023-10-04 11:26:45.0  )
చంద్రబాబు కేసు: ఏఏజీ పొన్నవోలు వాదనలపై న్యాయమూర్తి అసహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే అందజేయాలని కోరారు. ప్రభుత్వం నిర్వహించే స్కీముల్లో స్కాంలు జరిగితే దానికి బాధ్యత HODలు తీసుకుంటారా?.. లేక ముఖ్యమంత్రి తీసుకుంటారా అంటూ ప్రభుత్వ న్యాయవాదులకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్ స్కాం ద్వారా A37 కు డబ్బు అందినట్టు ఆధారాలు ఉన్నాయా? అని జడ్జి ఏఏజీ పొన్నవోలును ప్రశ్నించారు. చెప్పిందే చెప్పి విసిగించవద్దంటూ ప్రాసిక్యూషన్ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ గతంలో మాదిరిగానే వాదనలు వినిపించగా న్యాయమూర్తి అడ్డు చెప్పారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌ల సమయంలో వినిపించిన వాదనలే మళ్లీ వాదనలు ఎందుకు వినిపిస్తున్నారంటూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. చెప్పిన అంశాలనే పదేపదే చెప్తే ఎన్నిసార్లు వినాలని న్యాయమూర్తి తెలిపారు. ఈడీ దర్యాప్తు చేసిందని, ఐటీ నోటీసులు ఇచ్చిందని మళ్లీ ఇవే వాదనలు వినిపించడం సబబు కాదని న్యాయమూర్తి అన్నారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి: ఏఏజీ

స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై బుధవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విరామం ప్రకటించారు. విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ ప్రారంభమైంది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి అని వాదించారు. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ నేపథ్యంలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదు అని వాదించారు. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వాదించారు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ సార్థసానిల పాస్ పోర్టు సీజ్ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ స్కిల్ స్కాంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పుకొచ్చారు. షెల్ కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్న చంద్రబాబు తరఫు వాదనల్లో వాస్తవం లేదన్నారు. అది పూర్తిగా అబద్ధం అని చెప్పుకొచ్చారు. 05-01-2018న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు సీబీఐని విచారించాలని జీఎస్టీ కోరిందని కోర్టులో వాదించారు. ఈ కేసు విచారణను కంటితుడుపుగా చేశారని వాదించారు. మరోవైపు ఈ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.


Advertisement

Next Story

Most Viewed