అవినాశే సూత్రధారి.. హైకోర్టులో సీబీఐ వాదనలు

by Javid Pasha |   ( Updated:2023-04-18 14:48:43.0  )
అవినాశే సూత్రధారి.. హైకోర్టులో సీబీఐ వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డియేనని సీబీఐ ఆరోపించింది. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం వాదోపవాదనలు జరిగాయి. ఈ వాదనలలో ఎంపీ అవినాశ్ రెడ్డికి హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ కేసులో అసలు సూత్రాధారి అవినాశ్ రెడ్డియేనని సీబీఐ వాదించింది. వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 14 అర్ధరాత్రి జరిగింది అని సీబీఐ హైకోర్టుకు తెలియజేసింది. మార్చి 17న వైసీపి తరఫున కడప ఎంపీ టికెట్ అవినాశ్‌రెడ్డికి కన్ఫమ్ అయ్యిందని వివరించింది. మార్చి 21న అవినాశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాశ్ రెడ్డిని ఇకపై ప్రతీరోజూ విచారణ చేస్తాం అని సీబీఐ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టులో వాదించారు.

బెయిల్ ఇవ్వొద్దు

అవినాశ్ రెడ్డి గత నాలుగు విచారణల్లో సహకరించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కుట్ర అవినాశ్ రెడ్డికి తెలుసని సీబీఐ బలంగా వాదించింది. హత్యకు ముందు, హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఇంట్లో సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారని పదేపదే వాదించింది. సునీల్, ఉదయ్, జయప్రకాశ్ రెడ్డితో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఉన్న సంబంధాలపై మరింత సమాచారం కావాల్సి ఉందని తెలిపింది. అలాగే హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించాల్సి ఉందో తెలియాల్సి ఉందన్నారు. హత్య రోజు ఉదయం అవినాశ్ జమ్మలమడుగు దగ్గర్లో ఉన్నట్టు తెలిపారని కానీ ఆ సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు అతడి మొబైల్ సిగ్నల్స్ ద్వారా నిర్ధారించినట్లు సీబీఐ తెలిపింది. హత్య రోజు రాత్రంతా అవినాశ్ రెడ్డి అసాధారణంగా ఫోన్‌ వాడినట్లు గుర్తించినట్లు సీబీఐ వాదించింది.

ఆ ఇద్దరితో కలిసి విచారిస్తాం

వైఎస్ వివేకా హత్యకేసులో రిమాండ్‌లో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను బుధవారం కస్టడీకి తీసుకుంటున్నట్లు సీబీఐ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేశారు. ఆ ఇద్దరితోపాటే అవినాశ్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకే బుధవారం వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 10:30గం లకు ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ తెలిపింది.

వివేకా హత్యకు అవేవీ కారణం కావు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ప్రతీ అంశంపై విచారణ జరిపినట్లు సీబీఐ హైకోర్టుకు తెలియజేసింది. బెంగళూరు ఆర్ధిక లావాదేవీలు అంశంపై కూడా లోతైన విచారణ జరిపినట్లు సీబీఐ తెలిపింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డితో ఉన్న వివాదాలు, రాజకీయ గొడవలపైనా విచారించామని స్పష్టం చేసింది. అంతేకాదు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు వైఎస్ వివేకానంద రెడ్డి అక్రమ సంబంధాలపై కూడా లోతైన విచారణ చేసినట్లు సీబీఐ తెలిపింది. అయితే వైఎస్ వివేకా హత్యకు ఇవేవీ కారణం కాదని తమ విచారణలో నిర్ధారణ అయినట్లు సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. మెుత్తానికి బుధవారం నుంచి సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి విచారణ జరుగుతుంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ టార్గెట్ చేసిందని ఆయన తరఫున్యాయవాదులు, వైసీపీ ఆరోపిస్తుంటే...సీబీఐ మాత్రం అవినాశ్ రెడ్డియే ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తుంది. మరి విచారణలో ఎలాంటి సమాచారం ఇస్తారు..?ఈ కేసులో అసలైన ముద్దాయిలు ఎవరో ఈనెలాఖరుకు అయినా సీబీఐ నిర్ధారిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

Advertisement

Next Story