టీడీపీ, జనసేన తొలి జాబితాలో బీసీలకు పెద్దపీట

by GSrikanth |
టీడీపీ, జనసేన తొలి జాబితాలో బీసీలకు పెద్దపీట
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రా జిల్లాల్లో తెలుగుదేశం, జనసేనలు తొలివిడత అభ్యర్థుల ప్రకటనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బీసీలకు ఎక్కువ సీట్లు దక్కాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 34 సీట్లకు గాను 17 సీట్లను శనివారం ప్రకటించారు. రెండు జనసేవవి. మిగిలిన 15 తెలుగుదేశం పార్టీవి. రెండు పార్టీలు బీసీలకు పెద్దపీట వేశాయి. జనసేన విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి, ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి స్థానాన్ని గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణకు కేటాయించింది.

తెలుగుదేశం 15లో ఆరుగురు బీసీలు

ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 15 స్థానాలలో ఆరు బీసీలకు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకటించిన మూడు బీసీలకే ఇచ్చారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్‌కు ఇచ్చాపురం, కూన రవికుమార్‌కు ఆముదాల వలస, కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన కె.అచ్చెన్నాయుడుకి టెక్కలి కేటాయించారు. ఇక విజయనగరంలో గజపతినగరం బీసీ వర్గానికే చెందిన కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. ఇక్కడ వెలమ దొర సామాజిక వర్గానికి చెందిన (రంగారావు) బేబీ నయన బొబ్బిలి, పూసపాటి అదితి గజపతి రాజు విజయనగరం సీట్లు దక్కించుకొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర సామాజికి వర్గానికి చెందిన పీవీజీఆర్ నాయుడు (గణబాబు) విశాఖ పశ్చిమ, కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం స్థానాలను దక్కించుకొన్నారు.

ఎస్‌సీ స్థానాల ఎంపిక పూర్తి

ఉత్తరాంధ్రా పరిధిలోని ఎస్‌సీ రిజర్వుడు స్థానాలైన రాజాం నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి, పార్వతీపురం నుంచి విజయ్ బోనేల, పాయకరావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీట్లు దక్కించుకొన్నారు. ఎస్టీ స్థానాలతో పాలకొండ, పాడేరు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎస్టీ స్థానాలతో కురుపాం నుంచి తొయ్యక జగదీశ్వరి, సాలూరు నుంచి గుమ్మది సంధ్యారాణి, అరకు నుంచి సియ్యేరి దొన్ను దొరల పేర్లను ప్రకటించారు.

మాజీ మంత్రులకు సీట్లు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు సీట్లను దక్కించుకొన్నారు. ఉత్తరాంధ్రాలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తిల పేర్లకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు. జనసేన సీట్లు ఖరారు కాకపోవడమే జాప్యానికి కారణమని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed