టీడీపీ గూటికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన జాయినింగ్..?

by Satheesh |   ( Updated:2023-09-23 04:53:56.0  )
టీడీపీ గూటికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన జాయినింగ్..?
X

దిశ, కర్నూలు ప్రతినిధి: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫీవర్ పట్టుకుంది. మళ్లీ ఆయన టీడీపీ గూటికి చేరనున్నారు. ఇప్పటికే లైన్ క్లియర్ అయిపోయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో ఆయన అధికారికంగా చేరిక ఆగిపోయింది. ఆయన బయటకు రాగానే, పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని తీవ్ర చర్చ సాగుతోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో శాసించిన కుటుంబాల్లో బైరెడ్డి కుటుంబం ఒకటి. మాజీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందికొట్కూరు సెగ్మెంట్‌లో 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ప్రత్యర్థి గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో బైరెడ్డి, గౌరు చరితా రెడ్డిలు పాణ్యంలో పోటీ పడ్డారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2012లో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ గళం అందుకున్నారు. ఆ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు.

రాష్ర్ట విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాయలసమీ కోసం పోరాటం అందుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఆశించిన స్థాయిలో ప్రజాదారణ లేకపోవడంతో 2018లో కాంగ్రెస్ లో చేరారు. రాష్ర్ట విభజన కారణంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. మిత్ర శత్రువులైన బైరెడ్డి, గౌరు వెంకటరెడ్డి పార్టీ కోసం కలిసి పని చేశారు. ఆ తర్వాత తన కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంత కాలంగా రాయలసీమ వెనుకబాటుతనంపై గళమెత్తుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని వైసీపీ తీరును ఎండగడుతున్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేపట్టి సక్సెస్ అయ్యారు.

వారసుల పరిస్థితేంటీ ?

టీడీపీలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేరితే ఆయన వారసులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బీజేపీ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ఆయన వెంట వస్తారా ? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. బైరెడ్డి మాత్రం వారసుల రాజకీయ భవిష్యత్ కోసం పాటు పడుతున్నారని, వీరికోసమే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల అంశాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీని వీడి వస్తారా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక బైరెడ్డి కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరి బీజేపీని వదిలి తండ్రి వెంటే వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్వేషకులు చర్చించుకుంటున్నారు.

బైరెడ్డితో రాకతో మారనున్న సమీకరణాలు

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. జిల్లాపై పూర్తి అవగాహనతో పాటు పార్టీని నడిపించగల సత్తా ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. టీడీపీ అధిష్టానం బైరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు చర్చ సాగుతోంది. ఈయన రాకతో పార్టీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా చేరిక ఆగిపోయింది. ఇప్పటికే చంద్రబాబును కలిసేందుకు బైరెడ్డి రాజమహేంద్రవరం చేరుకోగా ఆయనను కలిసేందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు విడుదల కాగానే బైరెడ్డి తన అనుచర వర్గంతో పార్టీలో చేరనున్నారు.

Advertisement

Next Story