G. V. L. Narasimha Rao : బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు కీలక పదవి

by Seetharam |   ( Updated:2023-07-18 08:03:04.0  )
G. V. L. Narasimha Rao : బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు కీలక పదవి వరించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యునిగా నామినేట్ అయ్యారు. భువనేశ్వర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ ఒకటిగా ఉంది. ఈస్ట్ కోస్ట్ జోన్ నుండి ఐదుగురు లోక్‌సభ మరియు 3 రాజ్యసభ ఎంపీలు రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీలకు నామినేట్ అయ్యారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని వాల్తేరు డివిజన్‌లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి చెందిన రాజ్యసభ ఎంపీగా జీవీఎల్ నరసింహారావు నామినేట్ అయ్యారు. ఇకపోతే ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల రైల్వే వినియోగదారుల ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-విజయవాడ మధ్య మాత్రమే మొదట ప్లాన్ చేసిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం వరకు పొడిగించడానికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవ చూపారు. గంగా పుష్కరాలు మరియు వేసవి సీజన్ కోసం విశాఖపట్నం, గుంటూరు నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లను మంజూరు చేయడం కూడా కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ జీవీఎల్ కృషి చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని..విశాఖ రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్‌లో అనేకమార్లు ప్రస్తావించారు. విశాఖపట్నం నుంచి వారణాసి, లక్నో, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు సాధారణ రైళ్లను ప్రారంభించాలని ఆయన పార్లమెంటులో డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ప్రారంభమయి బెంగళూరుకు వెళ్లే విధంగా రెగ్యులర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించాలని ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరారు. మరోవైపు విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం, మెరుగైన ప్రయాణీకుల సేవలు మరియు సౌకర్యాలు మరియు వాల్తేరు డివిజన్‌లో మెరుగైన ప్రయాణీకుల మరియు కార్గో రవాణా కోసం అడ్డంకులు తొలగించడానికి కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన నామినేషన్‌ సందర్భంగా పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్‌లోని రైల్వే ఉద్యోగుల సంఘాలు, మెరుగైన రైలు సేవల కోసం కృషి చేస్తున్న పౌర సంఘ సభ్యులు మరియు పరిశ్రమల ప్రతినిధులు ఎంపీ జీవీఎల్ నరసింహారావును నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed