APCC: దమ్ముంటే ఆ పని చేసి చూపించండి.. అమిత్ షాకు వైఎస్ షర్మిల సంచలన సవాల్

by Ramesh Goud |
APCC: దమ్ముంటే ఆ పని చేసి చూపించండి.. అమిత్ షాకు వైఎస్ షర్మిల సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని, ఆయన మాటలు మరో మోసానికి నిదర్శనం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(APCC Chief YS Sharmila) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Minister Amith Sha) చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. కేంద్రమంత్రిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల.. వైఎస్ఆర్సీపీ పాలన(YSRCP Governance) ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? అని మండిపడ్డారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా.. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా? అని నిలదీశారు.

రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? అని, ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? అని ప్రశ్నించారు. సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు? అని, భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 5 ఏళ్లపాటు జగన్(YS Jagan Mohan Reddy) మీకు దత్తపుత్రుడు.. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మలా ఉన్నాడని దుయ్యబట్టారు అలాగే పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్.. రాష్ట్రంలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్.. అని వ్యాఖ్యానించారు.

మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు అమాయకులు కారని అన్నారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే అని, 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం.. రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమిత్ షా.. ఆయన వ్యాఖ్యల మీద కట్టుబడి ఉంటే.. ఆయనకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) తరుపున షర్మిల డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed