పోలవరంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం.. డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు

by srinivas |
పోలవరంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం.. డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని నీతీ ఆయోగ్ సమావేశం అనంతరం జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయ్యారు. జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై కూలంకషంగా చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాని జగన్ చేసిన నాశనాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని చంద్రబాబు అన్నారు.

నవంబర్‌లో నూతన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం పూర్తవటానికి రెండు సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని చంద్రబాబు వివరించారు. కేంద్ర నిధులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్‌ ముందుకు వెళ్లాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ, మలి దశ అనేవి లేవని, ప్రాజక్ట్ నిర్మాణం పూర్తి చేయడం ఒకటే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాజక్ట్​ పనులపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే మరో సీజన్‌ కూడా కోల్పోయే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

'కొత్త డయాఫ్రం వాల్‌' నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, అదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్‌ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. వాళ్లు అడిగిన మేరకు రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేసి ఆ కాపీని కేంద్ర మంత్రికి ఇచ్చామని అన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ ఖరారు చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుపేర్కొన్నారు.

వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. డయాఫ్రం వాల్‌ పూర్తి తర్వాత దానిపైన ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం వస్తుందని అన్నారు. కాఫర్‌ డ్యాంలు కొంత తగ్గించి, సీపేజ్‌ అంతా ఎత్తిపోస్తూ డయాఫ్రం వాల్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని, సీపేజ్‌ ఎత్తి పోయడంతోపాటు తగ్గించగలిగితే నిర్మాణానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. రెండు సీజన్ల కంటే ముందే డయాఫ్రం వాల్‌ పూర్తి చేయగలిగితే ఈసీఆర్‌ పనులు వెంటనే చేపట్టొచ్చని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed