నా ప్రశ్నకు బదులివ్వు: నారా బ్రహ్మణికి పోసాని కృష్ణమురళీ సవాల్

by Seetharam |
నా ప్రశ్నకు బదులివ్వు: నారా బ్రహ్మణికి పోసాని కృష్ణమురళీ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలలో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులు అయిన నారా భువనేశ్వరి కోడలు నారా బ్రహ్మణిలు సైతం పాల్గొంటున్నారు. స్కిల్ డవలప్‌మెంట్ ద్వారా ఎంతోమందికి తన మామ జీవితాలను ఇచ్చారని అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పరిపాలన అందించడమే చంద్రబాబు నాయుడు చేసిన నేరమా అని బ్రహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బ్రహ్మణి వ్యాఖ్యలకు సినీ నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అవినీతికి పాల్పడినవారిని జైలుకే పంపుతారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మణికి పలు ప్రశ్నలు సంధించారు. మీ తాత నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచిందెవరు..? మీ తాతను చెప్పుతో కొట్టిందెవరు..? మీ తాతను చంపిందెవరు..? అనే ప్రశ్నలకు బ్రాహ్మణి సమాధానం చెప్పాలని పోసాని కృష్ణమురళి సవాల్ విసిరారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ప్రజల కోసమేనా అంటూ పోసాని సెటైర్లు వేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై బ్రహ్మణి చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే నవ్వొస్తుందని అన్నారు. బ్రహ్మణి వ్యాఖ్యల ప్రకారం న్యాయమూర్తి మీద కేసులు పెట్టాలేమో అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలని సూచించారు. చంద్రబాబు ఏడాది పాటు జైలులో వుండి బయటకు వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోసాని కృష్ణమురళీ అన్నారు. చంద్రబాబు గతంలో తనపై నమోదు అయిన అభియోగాల నుంచి తప్పించుకునేందుకు 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని పోసాని కృష్ణమురళీ గుర్తు చేశారు. ఇకపై అలాంటివి జరగవని చంద్రబాబు తన తప్పును ఒప్పుకోవాల్సిందేనని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed