Online Magic: రిజిస్ట్రేషన్ శాఖలో నయా దందా

by srinivas |   ( Updated:2022-12-19 14:59:36.0  )
Online Magic: రిజిస్ట్రేషన్ శాఖలో నయా దందా
X
  • అక్రమ రిజిస్ట్రేషన్‌లు బయటపడకుండా జాగ్రత్తలు
  • ఆడిట్ అస్తవ్యస్తం!
  • చక్రం తిప్పుతున్న అధికారి!
  • రిజిస్ట్రేషన్‌లన్ని సక్రమమే అంటూ నివేదిక

దిశ, అనంతపురం: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. రెండు జిల్లాల్లోని మెజారిటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్‌ల దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారాలు పెద్ద ఎత్తున బయటపడుతూ ఉండగా రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు నయా దందాకు తెర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆడిట్‌కు వచ్చిన వారిని తమకు అనుకూలంగా మలచుకొని రిజిస్ట్రేషన్‌లన్ని సక్రమమే అంటూ నివేదిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక ప్రభుత్వ భూములు, నిషేధిత స్థలాల రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తే లేదని తొలుత బుకాయించినా దళారుల ద్వారా ముడుపుల మొత్తం ఓకే కాగానే చకచక రిజిస్ట్రేషన్‌లు జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్‌లోనూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం కంటికి కనిపిస్తున్నా అన్ని సక్రమమేనంటూ నివేదికలు తయారవుతున్నట్లు తెలుస్తోంది. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఖరాకండిగా తేల్చి చెప్పారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ కింది స్థాయి అధికారులు ఆ హెచ్చరికలను మాత్రం ఖాతరు చేయడం లేదు.

ఇటీవల కాలంలో భారీ ఎత్తున వివాదాస్పద రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం బయటపడుతూనే ఉన్నాయి. చేసిన అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం బయటపడకుండా కొత్త అంకానికి తెర లేపినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగినా అనంతరం ఈసీలు బయటకు రాకుండా, ఆన్ లైన్‌లో కనిపించకుండా చేస్తున్నట్లు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్‌లో సర్వే నంబర్ కొడితే ఈసీలు వచ్చేవి. ఇప్పుడు అలాంటివేవీ కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు సబ్ రిజిస్ట్రార్‌లు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు.

ఈ వ్యవహారం ముమ్మరంగా గుట్టుగా సాగుతున్నట్లు ఆ శాఖలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి ఒక ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూములు, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం కొద్ది రోజులు వాటిని ఆన్ లైన్‌లోకి ఎక్కించరు. ఎలాంటి అడ్డంకులు లేవని తెలిసిన వెంటనే అన్‌లైన్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు డాక్యుమెంట్ నెంబర్ కొడితే తప్ప ఈసీలు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

ఆడిట్‌లో అంతా అస్తవ్యస్తం!

రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగంలో పనితీరు అంతా మరింత అధ్వాన్నంగా, అస్తవ్యస్తంగా మారినట్లు సమాచారం అందుతోంది. అక్రమ రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం బయటపడకుండా ఆన్‌లైన్‌లో వ్యవహారాలన్నీ ఆడిట్ విభాగం‌లోని ఒక అధికారి కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు జరిగిన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ కరెక్ట్‌గా చెల్లించారా? లేదా? రిజిస్ట్రేషన్ అయిన స్థలం ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? అన్న కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ మాత్రం తప్పులు జరిగినా ఉన్నతాధికారులకు నివేదించాలి. సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు పంపాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ జరగవు. జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ సక్రమంగానే జరిగినట్లు నివేదికలు సిద్ధం చేస్తారు. మహా అంటే స్టాంపు డ్యూటీ‌లో చిన్న మొత్తం పొరపాటు జరిగి ఉంటే దాన్ని బయటికి తీసి తిరిగి కట్టించుకొని ఆ అంశాన్ని మూసేస్తారు. అంతే తప్ప ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగినా వాటిని మాత్రం బయట పెట్టరు. అక్రమ రిజిస్ట్రేషన్‌లలో ఆరి తేరిన ఘనాపాటి ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు.

గతంలో ఆయన అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సందర్భంలో వందల సంఖ్యలో ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే హిందూపూర్‌లో సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సందర్భంలో కూడా అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారు. ఎట్టకేలకు ఆయన సస్పెండ్ అయ్యారు. తిరిగి తన అధికారాన్ని ఉపయోగించుకొని మళ్లీ ఆడిట్ విభాగంలోకి పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ అతనిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పైగా ఆయన గురించి వార్తలు రాస్తే జీర్ణించుకోలేడు. ఇదిలా ఉండగా గతంలో జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నింటిని డాక్యుమెంట్ నెంబర్ కొడితే తప్ప ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసే ప్రక్రియ గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed