- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘సిద్ధం’ సభ హిట్టా.. ఫట్టా?

దిశ ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన సీఎం జగన్ 'సిద్ధం' సభ విజయవంతం అయిందా? లేక తుస్సు మనిందా? దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా విజయవంతమయిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొంటున్నారు. అయితే, జనాన్ని బలవంతంగా తరలించి నిర్వహించేది ఒక సభేనా అని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ఏదైనా భారీ సభ జరిగిన సందర్భాల్లో దాని గురించి కొద్దిరోజుల పాటు చర్చ జరగడం సహజం. కానీ, ఈసారి మాత్రం అలాంటి చర్చ జరిగినట్టు ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో రెండు ప్రతికూల అంశాల గురించి మాత్రం ఇప్పటికీ విపరీతంగా చర్చించుకుంటున్నారు. అందులో ఒకటి.. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అదే సభలో వైసీపీ అల్లరి మూకలు ఆటవికంగా దాడి చేసి గాయపరచడం. రెండు.. ప్రయాణికుల కష్టాలు..
ఫొటోగ్రాఫర్‌పై దాడికి వెల్లువెత్తిన నిరసనలు
రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకలు ఆటవికంగా దాడి చేసి గాయపరచడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురి చేసింది. దాడికి సంబంధించిన వీడియో చూసిన వారి ఒళ్లు గగుర్పొడిచింది. ఈ సంఘటనపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించాయి. తద్వారా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ గా మారింది.
పైగా, ఇప్పుడే ఈ చిచ్చు ఆరేలా కూడా లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనను ఖండించకపోవడం, కొడాలి నాని వంటి వారు పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడడం, కర్నూలు ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై వైసీపీ శ్రేణులు మంగళవారం రాళ్లతో దాడి చేయడం జర్నలిస్టు సంఘాల్లో మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీనికితోడు ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం కూడా వారి సహనాన్ని పరీక్షించడమే. మొత్తమ్మీద ఈ సంఘటనతో సిద్ధం సభ లక్ష్యం దెబ్బ తినిందని చెప్పవచ్చు. పైగా, పార్టీకి మరింత నష్టం కలిగించిందనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.
ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం
'సిద్ధం' సభ ఏ మేరకు విజయవంతమయిందనే దానికంటే ప్రయాణికులు పడ్డ కష్టాలే ప్రస్తుతం ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి. మూడు వేలకు పైగా ఆర్టీసీ బస్సులను, మరో మూడు వేలకు పైగా ప్రైవేటు, పాఠశాలల బస్సులను సభ కోసం వినియోగించారు. ఈ కారణంగా.. వివిధ ప్రాంతాల్లో బస్టాండ్లకు బస్సులు రాక ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎందుకు బస్సులు రాలేదో తెలుసుకొని శాపనార్థాలు పెట్టసాగారు. తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వారు పడిన అవస్థలు చేప్పలేనివి. ఇది రాయలసీమ జిల్లాల్లో మాత్రమే ఏర్పడిన సమస్య కాదు. గుంటూరు వరకు దాదాపు ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. అలాగే, హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించిన కారణంగా దూరం పెరగడం ఒక సమస్య అయితే, ట్రాఫిక్ జామ్ అయి.. గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సి రావడం మరో సమస్య. దీంతో వారంతా సభ నిర్వాహకులను తిట్టుకుంటూ గడిపారు. ఇది కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే అంశమే.
మేనిఫెస్టో ప్రకటన ఉత్తిదే..
రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. రైతు రుణమాఫీ ప్రకటన చేయడం ద్వారా వారి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు జగన్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారనే అందరూ భావించారు. అయితే, అలాంటివేమీ చేయకపోవడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. తమ అంచనాలకు తగ్గట్టు సభ జరగలేదనే అభిప్రాయానికి చాలామంది వచ్చారు. సభకు జనం పెద్ద సంఖ్యలో రావడం, కేరింతలు కొట్టడం వరకు బాగానే ఉంది కానీ, ఏ వర్గానికి ఎలాంటి వరాలు ప్రకటించకపోవడం ఒక మైనస్ పాయింటుగానే చెప్పుకోవచ్చు. ఎప్పటిలాగే చంద్రబాబును, మీడియాను, పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ఆయన పరిమితమయ్యారు. తద్వారా సామాన్య ప్రజలకు తన పర్యటన ద్వారా చేకూరిన ప్రయోజనం శూన్యమని నిరూపించారు. రూ. కోట్లు ఖర్చుపెట్టి.. లక్షలాది మందిని ముప్పు తిప్పలు పెట్టి జగన్ సాధించిందేమిటో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది.