విభజన పిటీషన్లపై విచారణ వాయిదా

by S Gopi |
Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినజనను సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఈ పిటీషన్‌తో పాటు తెలంగాణ వికాస్ కేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా బుధవారం విచారించాల్సి ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న ప్రత్యేక నిబంధన మేరకు వాయిదా వేసింది. తుది దశ విచారణకు వచ్చిన పిటీషన్లపై మాత్రమే వాదనలు వినేలా తాజాగా నిబంధన రూపొందించుకున్నది. రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే పిటీషన్ల విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తాజా నిబంధనల్లో సుప్రీంకోర్టు పేర్కొన్నది. రెండు రోజుల ముందు నోటీసులు ఇచ్చిన పిటిషన్ల విచారణకు కూడా ఈ నిబంధన ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో విభజన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం, రూపొందించుకున్న నిబంధనల ప్రకారం విభజన పిటీషన్లపై తదుపరి విచారణ ఎప్పుడు జరపనున్నదీ వివరించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరఫున హాజరైన న్యాయవాది అల్లంకి రమేష్ ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా ఈ పిటీషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నట్లు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర విభజన జరగాల్సి ఉంఠుందని, కానీ ఆ నిబంధనలను అప్పటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. న్యాయవాది రమేశ్ ప్రస్తావన మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పర్దీవాలా తో కూడిన త్రిసభ్య ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed