కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలక వ్యాఖ్యలు

by Shyam |
Professor Subramaniam
X

దిశ ప్రతినిధి, వరంగల్: దేశంలోని 80 శాతం పేదల కడుపు కొడుతూ.. పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆంధ్రా యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ చెప్పారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో ప్రతీ ఆదివారం నిర్వహించే తెలంగాణ జనవేదిక సదస్సులో భాగంగా 420 ఆన్లైన్ జూమ్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో ‘మనదేశంలో నయా ఉదారవాదం నుంచి అసమానతలు’ అంశంపై జరిగే సదస్సులో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ఎకానమిక్స్ విభాగం ప్రొఫెసర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం హాజరై కీలక ప్రసంగం చేశారు. మనదేశంలో నయా ఉదారవాదం ప్రధాన ఉద్దేశ్యం పెద్ద పెట్టుబడిదారులకు ఉదారంగా రాయితీలు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించడం అని చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్థ బలపడటంతో దేశంలోని ప్రజల కొనుగోలుశక్తి పడిపోయి ఆర్థిక మాంధ్యం ఏర్పడుతుందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు ఒప్పందాల మేరకు దేశంలోని ప్రజల ప్రయోజనాల తాకట్టు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ బ్యాంకు ప్రధాన షరతు మేరకు ప్రైవేటీకరణలో భాగంగా విద్య, ఆరోగ్యం తదితర రంగాలను ప్రభుత్వం వదిలించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో అనేకమంది పేదరికంలో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సగటులో అత్యధిక మంది పేదలుగానే గుర్తించబడుతున్నారని చెప్పారు. దేశంలోనే చారిత్రక ఉద్యమంగా ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాన్ని గుర్తించవచ్చునని తెలిపారు. తెగింపుతో చేసిన పోరాటం విజయం సాధిస్తోందని, రైతుల ఉద్యమమే దానికి నిదర్శనమని చెప్పారు. అదానీ, అంబానీలకు దోచిపెడుతోన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు తిప్పికొడుతారని అన్నారు.

అనంతరం తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కెళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన రోనాల్డ్, రీగన్లు నయా ఉదారవాదం భావనలను గుర్తించారని చెప్పారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ న్యూ ఇండియా పాలసీ తెచ్చారని చెప్పారు. 1991 అప్పటి దివంగత ప్రధాని పీవీ నర్సింహరావు రిబ్రలైజేషన్ పాలసీ తెచ్చారని గుర్తుచేశారు. 50 ఏళ్ళలో ఆర్థిక సరళీకరణ విధానాలతో విద్య, ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులను పడుతున్నారని వెల్లడించారు. ఈ సదస్సులో సంయోజకులుగా డాక్టర్ తోట శ్రీనివాసులు వ్యవరించారు. డాక్టర్ సంగాల ఎమ్రాజ్, డాక్టర్ కొట్టే భాస్కర్, ముంజుం వెంకటరాజంగౌడ్, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్, ప్రొఫెసర్ భీష్ణుచౌదరి, అంజన్ రావు, బజార్ రంగారావు, బిర్రు శ్యాం, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, డాక్టర్ బైశెట్టి కవిత, జేమ్స్ ప్రశాంత్, మనోజ్ రెడ్డి, మట్టెడ కుమార్, మేరుగు రామకొటి, వడ్డె రవీందర్, పెండ్లి అశోక్ బాబు, ఉమామహేశ్వర్రెడ్డి, అమర్ నాథ్, వెంకట్ వీర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed