దేశాధినేతలను కూడా వదల్లేదు.. పాపంగా చూడొద్దు: జగన్

by srinivas |
దేశాధినేతలను కూడా వదల్లేదు.. పాపంగా చూడొద్దు: జగన్
X

కరోనా వైరస్ సోకడాన్ని పాపంగానో లేక తప్పుగానో చూడొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందించే వరకు సమగ్రమైన విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ గత రెండు రోజలుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిగి జమాత్ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారి నుంచే కరోనా వైరస్‌ విస్తరిస్తోందని ఆయన వెల్లడించారు. అందుచేత ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

కరోనా కూడా మిగతా ఫ్లూ, జ్వరాల లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వయసు పైబడ్డ వారితో పాటు బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారిపై దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. అందువల్ల ఎవరూ అధైర్య పడాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందన్న సంగతి అంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

దేశాధినేతలు, వారి కుటుంబ సభ్యులను కూడా కరోనా వైరస్ వదల్లేదని ఆయన గుర్తు చేశారు. వారిలో చాలా మందికి జ్వరంలా బయటపడి నయమైనట్టుగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. అందుకే కరోనా వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధిగ్రస్తులకు ధైర్యంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags: corona virus, ap cm, ys jaganmohanreddy, jagan, andhrapradesh, sinful or wrong

Advertisement

Next Story

Most Viewed