ఆఫీస్‌కెళ్తే ఉండ‌రు.. ఫోన్ చేస్తే ఎత్తరు

by Shyam |
ఆఫీస్‌కెళ్తే ఉండ‌రు.. ఫోన్ చేస్తే ఎత్తరు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లో కీల‌క‌మైన ప‌దవిలో ఉన్న ఓ అధికారి వ్య‌వ‌హార తీరుపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అనేక ఫిర్యాదులు.. ప‌నులు, స్ప‌ష్ట‌త కోసం కార్యాల‌యానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కుడాలో కీల‌క‌మైన ప‌ద‌విలో కొన‌సాగుతున్న స‌ద‌రు అధికారి ద‌ర్శ‌న‌మే మ‌హా భాగ్యంగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌రు. కార్యాల‌యానికి ఎప్పుడు వ‌స్తారో.. ఎప్పుడు వెళ్తారో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాపోతున్నారు.

రోజుల తరబడి..

రోజుల త‌ర‌బ‌డి కార్యాల‌యాల వ‌ద్ద వేచి ఉంటున్న స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటున్నారు. కార్యాల‌యానికి వ‌చ్చి వేచి చూస్తే క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారని సిబ్బంది చెప్తున్నారు. అర్జంట్‌గా క‌ల‌వాల‌ని, మాట్లాడాల‌ని ఫోన్ చేసినా ఎత్త‌డం లేదని సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన జ‌నం వాపోతున్నారు. తమ ఫోన్ ఎత్త‌రు. ఇక కొత్త నెంబ‌ర్ల‌తో చేసే వారి నెంబ‌ర్ల‌ను ప‌ట్టించుకోరు సారూ.. అంటూ కార్యాల‌య సిబ్బందే చెబుతుండ‌డం విస్తుగోలుపుతోంది. కీల‌క‌ బాధ్య‌త‌ల్లో ఉండి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌ద‌రు అధికారిపై చైర్మ‌న్ మ‌ర్రియాద‌వ‌రెడ్డి, వైస్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌ల్లో ఉన్న జీడ‌బ్ల్యూఎంసీ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

అవినీతి ఆరోపణలు!

స‌ద‌రు అధికారిపై అవినీతి ఆరోప‌ణ‌లు ఎన్నాళ్లుగానే వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఓ కేసులో కూడా ఇరుక్కున్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌డానికి స‌మ‌యం ఇవ్వ‌ని స‌ద‌రు అధికారి వ్యాపారుల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ సంత‌కాలు పెట్టివ‌స్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇలాంటి అధికారి నిర్వాకం కుడా పాల‌క వ‌ర్గానికి తెలియ‌కుండా ఉంద‌నుకోలేమ‌ని ప్ర‌జ‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Next Story