కేర‌ళ‌లో మ‌రో ఏనుగు మృతి

by Shamantha N |

తిరువ‌నంత‌పురం: కేరళలో మ‌రో ఏనుగు మృతి చెందింది. ఉత్త‌ర నీలాంబుర్ అట‌వీ రేంజ్ ప‌రిధిలోని మ‌ల‌ప్పురంలో సోమవారం తీవ్ర గాయాల‌తో ఓ ఏనుగు మృతి చెందిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు వెల్ల‌డించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఏనుగుకు ఐదు రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. అయిప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఏనుగు క‌ళేబ‌రాన్ని పోస్టుమార్టానికి పంపారు. మ‌రో ఏనుగుతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ కార‌ణంగానే దీనికి గాయాలైన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో పేర్కొన్నారు.

కేర‌ళ‌లోని పాలక్కడ్‌లో పేలుడు పదార్థాలు నింపిన పండుతిని గర్భంతో ఉన్న 15 ఏళ్ల ఏనుగు మరణించిన విష‌యం విదిత‌మే. అడవి జంతువుల నుంచి పంటపొలాలను కాపాడుకునేందుకు స్థానికులు పేలుడు పదార్థాలున్న పండ్లను ఉంచి వాటి చావుకు కారణమవుతున్నారని అధికారుల విచార‌ణ‌లో తేలింది. ఏనుగు మృతికి కారణమైన ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

పేలుడు పదార్థాలు నింపిన పండు తినడం వల్ల నోరు ఛిద్రమై తీవ్ర వేదన అనుభవించి ఆ ఏనుగు ప్రాణాలు వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పర్యావరణ, జంతు ప్రేమికులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed