సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ ఏర్పాటు..

దిశ, వెబ్ డెస్క్ :
సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దాని స్థానంలో కొత్తగా ఏఎంఆర్డీఏ( అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)ను తీసుకొచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాల డెవలప్మెంట్ కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేయగా… ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసి ఏఎంఆర్డీఏను తెచ్చింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు, సీఆర్డీఏ రద్దుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రభుత్వానికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఏఎంఆర్డీఏను తీసుకొచ్చారని సమాచారం.

ఇక సీఆర్డీఏ పరిధి అంతా ఇకపై ఏఎంఆర్డీఏ పరిధిలోకి వస్తుందని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఏఎంఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహ నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా పురపాలక కార్యదర్శి, సభ్యులుగా 11మంది అధికారులు నియామకం అయ్యారు. ఈ కమిటీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, డైరక్టర్ టౌన్ ప్లానింగ్, డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్, గుంటూరు, కృష్ణాజిల్లా కలెక్టర్లు సభ్యులుగా నియమితులయ్యారు.

Advertisement