ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుంది

by srinivas |
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుంది
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని కావలి నియోజకవర్గంలోని సున్నంబట్టి దగ్గర నుంచి 24వ రోజు పాదయాత్ర మెుదలైంది. ఈ పాదయాత్రలో టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వేలాది మంది ప్రజలు తరలివచ్చి రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండటం పట్ల ప్రజలు తమ అభీష్టాన్ని స్పష్టం చేశారని వెల్లడించారు.

అంతేకాకుండా పాదయాత్ర విజయవంతంగా కొనసాగేందుకు పలువురు విరాళాలు అందించడం ద్వారా అమరావతిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పుకొచ్చారు. మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టించినా ఖాతరు చేయకుండా రైతులు, మహిళలు మెుక్కవోని దీక్షతోయాత్ర చేస్తుండటం అభినందనీయమన్నారు. మరోవైపు కావలిలో మహాపాదయాత్రలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు, గౌడ, వడ్డెర, నాయీ బ్రాహ్మణ, యాదవ, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ప్రజలందరి అభీష్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని నేతలు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed