ఈ-కిరాణా సేవలను తిరిగి ప్రారంభించనున్న జొమాటో

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో తన ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. గతేడాది దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించినప్పటికీ కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సంబంధిత అంతరాయాల వల్ల నిలిపేసింది. తాజాగా దీన్ని మళ్లీ కొనసాగించాలని నిర్ణయించినట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే ప్రముఖ ఈ-కిరాణా ప్లాట్‌ఫామ్ కంపెనీ గ్రోఫర్స్‌లో 100 మిలియన్ డాలర్లు(రూ. 747 కోట్ల)తో 10 శాతం వాటాను జొమాటో […]

Update: 2021-07-08 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో తన ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. గతేడాది దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించినప్పటికీ కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సంబంధిత అంతరాయాల వల్ల నిలిపేసింది. తాజాగా దీన్ని మళ్లీ కొనసాగించాలని నిర్ణయించినట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే ప్రముఖ ఈ-కిరాణా ప్లాట్‌ఫామ్ కంపెనీ గ్రోఫర్స్‌లో 100 మిలియన్ డాలర్లు(రూ. 747 కోట్ల)తో 10 శాతం వాటాను జొమాటో దక్కించుకుంది. అయితే, గ్రోఫర్స్‌లో పెట్టుబడులు ఉన్నప్పటికీ తాము సొంతంగానే ఈ-కిరాణా విభాగాన్ని ప్రారంభించనున్నట్టు జొమాటో సీఎఫ్ఓ అక్షంత్ గోయెల్ అన్నారు.

ఏదేమైనప్పటికీ జొమాటో ఈ-కిరాణా విభాగంలోకి ప్రవేశించడం ద్వారా ఇప్పటికే కొనసాగుతున్న స్విగ్గీకి పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కంపెనీతో కలిసి కిరాణా సరుకుల డెలివరీని నిర్వహిస్తోంది. అలాగే, బిగ్‌బాస్కెట్ కూడా ఈ విభాగంలో ఉంది. బిగ్‌బాస్కెట్ ఇటీవల వ్యాపార విస్తరణలో భాగంగా దేశీయ దిగ్గజ సంస్థ టాటా డిజిటల్ నుంచి రూ. 9,500 కోట్ల నిధులను సమీకరించింది. కాగా, జొమాటో ఈ నెల 14-16 మధ్య ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)ను నిర్వహించనున్నట్టు గురువారం ప్రకటించింది. ఐపీఓ ద్వారా జొమాటో మొత్తం రూ. 9,375 కోట్లను సమీకరణ లక్ష్యంగా ఉంది. ఒక్కో షేర్ ఇష్యూ ధరను రూ. 72-76గా కంపెనీ నిర్ణయించింది.

Tags:    

Similar News