కేటీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన వైఎస్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల బర్త్ డే గిఫ్ట్ ను ఇచ్చారు. కేటీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదల ఇవ్వాలని తనదైన శైలిలో శనివారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని ఇవ్వాలని ఆమె ఆశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల బర్త్ డే గిఫ్ట్ ను ఇచ్చారు. కేటీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదల ఇవ్వాలని తనదైన శైలిలో శనివారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని ఇవ్వాలని ఆమె ఆశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే మనసు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు. మంత్రిగా కేటీఆర్ బాధ్యతలను గుర్తు చేసేందుకు చిన్న వీడియోను కానుకగా ఇస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఇందులో తన చదువుల కోసం తల్లిదండ్రులకు భారం కాకూడదని వనపర్తి జిల్లాకు చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ యువతి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలావుండగా మొన్నటి వరకు కేటీఆర్ ఎవరో తెలియదని చెప్పిన షర్మిలకు ఇప్పుడు ఎలా తెలిశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
27న పుల్లెంల గ్రామంలో పర్యటన
వైఎస్ షర్మిల నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతోంది. అందులో భాగంగా ఆమె ఈ నెల 27వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలేదని ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆమె నిరాహారదీక్షను చేపట్టనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు లోటస్ పాండ్ లో ఆవిష్కరించారు. పోస్టర్ల ఆవిష్కరణలో వాడుక రాజగోపాల్, పిట్ట రాంరెడ్డి, భూమి రెడ్డి, కేటీ నరసింహా రెడ్డి, సత్యవతి, సయ్యద్ ముజ్తబా అహ్మద్, నీలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.