ఎంపీటీసీగా గెలిచిన తల్లి.. వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏడుస్తూ కొడుకు నిరసన
దిశ, ఏపీ బ్యూరో: సాధారణ ఎన్నికల్లో ఆ నేత వైసీపీ గెలుపుకోసం శ్రమించాడు. పార్టీ అధినేత జగన్ పాదయాత్రలో సైతం పాల్గొన్నాడు. పంచాయతీ.. పరిషత్ ఎన్నికల్లోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన తల్లిని పోటీ చేయించి గెలిపించుకున్నాడు. ఎన్నికల్లో గెలిచిన వారంతా సంబరాలు చేసుకుంటే ఆ వైసీపీ నేత మాత్రం తల్లితో కలిసి ధర్నాకు దిగాడు. అదికూడా వైసీపీ నేతలపైనే. తనకు న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్నాడు. మెడలో కండువా.. కంటినిండా కన్నీరు […]
దిశ, ఏపీ బ్యూరో: సాధారణ ఎన్నికల్లో ఆ నేత వైసీపీ గెలుపుకోసం శ్రమించాడు. పార్టీ అధినేత జగన్ పాదయాత్రలో సైతం పాల్గొన్నాడు. పంచాయతీ.. పరిషత్ ఎన్నికల్లోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన తల్లిని పోటీ చేయించి గెలిపించుకున్నాడు. ఎన్నికల్లో గెలిచిన వారంతా సంబరాలు చేసుకుంటే ఆ వైసీపీ నేత మాత్రం తల్లితో కలిసి ధర్నాకు దిగాడు. అదికూడా వైసీపీ నేతలపైనే. తనకు న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్నాడు. మెడలో కండువా.. కంటినిండా కన్నీరు కారుస్తున్న ఆ నాయకుడిని చూసిన వారంతా ఏం జరిగిందోనని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆ వైసీపీ నేత ఏడుస్తుంది ఎందుకంటే ఎంపీపీ పదవికోసం. తన తల్లిని ఎంపీపీ సీట్లో కూర్చుబెట్టాలని ప్రయత్నించాడు. అదికాస్తా బెడిసి కొట్టడంతో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఇలా నిరసనకు దిగాడు. వైసీపీ నేత ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోడుమూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్ రెడ్డిల మధ్య విభేదాలున్నాయి. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ కోట్ల హర్షవర్థన్‌రెడ్డి ఆరోపిస్తుంటే.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటూ ఎమ్మెల్యే సుధాకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే, సమన్వయకర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరూ ఎడమెహం-పెడమెహంగా ఉంటున్నారు. అయితే తాజాగా గూడూరు ఎంపీపీ పదవి విషయంలో ఈ విభేదాలు మరోసారి రచ్చకు దారితీశాయి. కోట్ల హర్షవర్థన్‌రెడ్డి వర్గీయుడైన నరసింహారెడ్డి గూడూరు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే గూడూరు ఎంపీపీ పదవి తన తల్లికి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు.
అందులో భాగంగానే తన తల్లి రాజమ్మను కే నాగలాపురం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో తల్లి రాజమ్మ ఘన విజయం సాధించింది. దీంతో ఎంపీపీ పదవి తన తల్లికి వస్తోందని నరసింహారెడ్డి ఆశించారు. అయితే గత ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన చనుగొండ్లకు చెందిన ప్రతాప్‌రెడ్డి తన భార్యకు ఎంపీపీ పదవి ఇప్పించుకునేందుకు చక్రం తిప్పారు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి నిరసనకు దిగారు. తన తల్లి గ్రామ కార్యకర్తలతో కలిసి నాగలాపురం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఇంతకాలం కష్టపడితే పదవి వస్తుందనుకున్న సమయంలో వేరే వాళ్ళు తన్నుకపోవడం పట్ల నరసింహారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. దుఃఖం పట్టలేక బోరున విలపించారు. కష్టపడిన కార్యకర్తలకు సీఎం జగన్ న్యాయం చేయాలని బోరున విలపించారు.
కార్యకర్త ఆత్మహత్యాయత్నం
గూడూరు ఎంపీపీ పదవి కోసం కే నాగలాపురం వద్ద స్థానిక వైసీపీ నేత నరసింహారెడ్డి తన తల్లితోపాటు వైసీపీ మహిళా నేతలతో కలిసి నిరసనకు దిగారు. ఈ విషయం కర్నూలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ, వైసిపి నాయకులు నరసింహరెడ్డితో మాట్లాడేందుకు వచ్చిన ఎమ్మెల్యే డా.జరదొడ్డి సుధాకర్ కే నాగలాపురం వచ్చారు. నరసింహారెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఓ వైసీపీ కార్యకర్త పురుగుల మందు డబ్బా తీసి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆ పురుగుల మందు డబ్బాని లాక్కొని ఆ యువకుడిని సముదాయించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది.