కేసీఆర్ ఆశయం త్వరలో నెరవేరనున్నదా..?
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి.. ఇది భవిష్యత్ తరాలకు అందించే సంపద. పాతతరానికి మర్చిపోలేని మధురానుభూతి. యావత్ ప్రపంచం అబ్బురపడేలా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్నయాదాద్రి ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తుది దశ పనులను అత్యంత జాగ్రత్తగా కంప్లీట్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని ఆయనే దగ్గరుండి మరీ చేయిస్తున్నంతగా ఎప్పటికప్పుడు పనుల వివరాలు తెలుసుకుంటున్నారు. ఆలయంలో అడుగడుగునా.. యాదాద్రి క్షేత్రంపై మూలమూలన ఏం ఉండాలి? ఏం ఉండొద్దనే […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి.. ఇది భవిష్యత్ తరాలకు అందించే సంపద. పాతతరానికి మర్చిపోలేని మధురానుభూతి. యావత్ ప్రపంచం అబ్బురపడేలా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్నయాదాద్రి ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తుది దశ పనులను అత్యంత జాగ్రత్తగా కంప్లీట్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని ఆయనే దగ్గరుండి మరీ చేయిస్తున్నంతగా ఎప్పటికప్పుడు పనుల వివరాలు తెలుసుకుంటున్నారు. ఆలయంలో అడుగడుగునా.. యాదాద్రి క్షేత్రంపై మూలమూలన ఏం ఉండాలి? ఏం ఉండొద్దనే అంశాలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలను కొత్త ఆలయంలోనే చేసేందుకు సీఎం కేసీఆర్ గట్టి సంకల్పంతో ఉన్నారు. యాదాద్రి పనులపై ప్రగతి భవన్‌లో మరోసారి సమీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి యాదాద్రిని సందర్శించారు. పనులను అడుగడుగునా పర్యవేక్షించి.. అధికారులతో సమీక్షలు చేశారు. సమస్త సమాచారాన్ని నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు అందించారు. వచ్చే మార్చిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పునర్నిర్మితమవుతున్న ఆలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆశయంగా పెట్టుకున్నారు.
రోడ్డు విస్తరణ పనులపై దిశానిర్దేశం
యాదాద్రిలో జోరుగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. గుట్ట నుంచి తుర్కపల్లి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతమైంది. ప్రస్తుతం వైకుంఠ ద్వారం ముందు భాగంలోనూ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఇటీవలే ఆ రోడ్డు మార్గంలో భారీ కల్వర్టు నిర్మాణం చేపట్టిన అధికారులు వేగంగా రోడ్డు పనులు చేస్తున్నారు. ఇదే మార్గం గుండా యాదాద్రి కొండ పైకి భక్తులు తమ వాహనాల్లో వెళ్తున్నారు. కాబట్టి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచారు. యాదాద్రికి వచ్చే భక్తులకు, ఆహ్లాదకరంగా ఉండేందుకు రోడ్డు వెంట చెట్లు, మొక్కలు, గ్రీనరీనీ పెంచారు. అదేవిధంగా రోడ్డుకిరువైపులా డ్రైనేజీ వాటర్ వెళ్లడానికి వీలుగా పనులను పూర్తి చేశారు. భక్తజనుల అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన రోడ్లతో, సుందరీకరణగా తీర్చిదిద్దారు.
స్వామి సన్నిధిలో శ్రావణమాస వేడుకలు
శ్రావణమాసం మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈ నెల 24న అమ్మవారి తిరునక్షత్రోత్సవం, 25న నాగపంచమి వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ తిరుపతి యాదాద్రిలో ఈనెల 29 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శ్రావణమాసం మొదలయ్యాక ఈనెల 29 నుంచి 31వరకు ఉత్సవ పర్వాలను నిర్వహించేందుకు ఆలయ పూజారులు ఏర్పాట్లకు ఉపక్రమించారు. 30, 31 తేదీల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేశారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా యాదాద్రిలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను రద్దుచేసిన విషయం విదితమే. ఇతర పూజలన్నీ ఏకాంత సేవలుగా కొనసాగుతాయి.