Who Is Sheikh Hasina : షేక్ హసీనా ఎవరు ? రాజకీయ నేపథ్యం ఏమిటి ?

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా.. ఈపేరు సోమవారం రోజు అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది.

Update: 2024-08-05 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా.. ఈపేరు సోమవారం రోజు అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది. దేశంలో ప్రజా నిరసనలు తీవ్రరూపు దాల్చడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి హసీనా హుటాహుటిన భారత్‌కు చేరుకున్నారు. దీంతో బంగ్లాదేశ్‌ అధికార పీఠంపై నుంచి అవామీ లీగ్ పార్టీ గద్దె దిగినట్లయింది. ఇంతకీ షేక్ హసీనా ఎవరు ? ఆమె నేపథ్యం ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

బంగ్లాదేశ్ జాతిపిత దారుణ హత్య.. 1975 ఆగస్టు 15

ప్రతీ దేశంలోనూ కొన్ని బలమైన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్‌లోనూ ఒక బలమైన రాజకీయ కుటుంబం ఉంది. దానికి ఆద్యుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ఈయనే. షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను బంగ్లాదేశ్ జాతిపిత అని కూడా పిలుస్తారు. షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కుమార్తె షేక్ హసీనా 1960వ దశకంలో ఢాకా యూనివర్సిటీలో ఉన్న టైంలోనే పాలిటిక్స్‌లో చురుగ్గా పాల్గొనేవారు. 1968లో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను ఆమె వివాహం చేసుకున్నారు. మరోవైపు 1971 మార్చి 26న పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది. ప్రత్యేక దేశంగా అది ఆవిర్భవించింది. పాకిస్తాన్‌పై యుద్ధంలో బంగ్లాదేశ్‌కు భారత ఆర్మీ సహాయ సహకారాలు అందించింది. 1971 ఏప్రిల్ 17 నుంచి 1972 జనవరి 12 బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ సేవలు అందించారు. తదుపరిగా 1975 జనవరి 25న దేశ తొలి అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే 1975 ఆగస్టు 15న ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు హసీనా తల్లి, ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. అయితే ఈ మర్డర్స్ జరిగిన టైంలో ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో లేరు. ఈ హత్యల తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు హసీనా విదేశాల్లోనే ఉండిపోయారు. బయటి దేశాల్లో ఉంటూనే తమ దేశంలోని అవామీ లీగ్ పార్టీకి ఆమె అప్పట్లో దిశానిర్దేశం చేశారు. ఎట్టకేలకు 1981లో ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. నాటి ప్రభుత్వం ఆమెను చాలా నెలల పాటు గృహనిర్బంధంలోనూ ఉంచింది.

1996 నుంచి ఏకఛత్రాధిపత్యంగా..

1990 డిసెంబర్‌లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) గెలిచింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. దీంతో తొలిసారిగా దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆమెకు దక్కింది. 1996 నుంచి 2001 వరకు, మళ్లీ 2009 నుంచి తాజాగా రాజీనామా చేసేవరకు బంగ్లాదేశ్‌ను ఏకఛత్రాధిపత్యంగా షేక్ హసీనా పరిపాలించారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా ఖ్యాతిని గడించారు.2004 ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై జరిగిన గ్రనేడ్ దాడిలో 22 మంది చనిపోయారు. ఆ దాడి నుంచి హసీనా బయటపడ్డారు.

Tags:    

Similar News